కర్ణాటక డిప్యూటీ సీఎం (Deputy CM) డీకే శివకుమార్ (DK Shiva Kumar) కు ఆ రాష్ట్ర హైకోర్టు (High Court) షాక్ ఇచ్చింది. గతంలో ఆయనపై సీబీఐ నమోదు చేసిన అక్రమాస్తుల కేసును కొట్టి వేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో సీబీఐ తాత్కాలిక విచారణపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్టు జస్టిస్ కే నటరాజన్ తెలిపారు.
ఈ కేసులో విచారణను పూర్తి చేయాలని సీబీఐని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసులో మూడు నెలలలోగా దర్యాప్తు నివేదికను అందించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేశారు. 2013-18 మధ్య డికే శివకుమార్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు రూ. 74.8 కోట్ల అక్రమాస్తులను కలిగి వున్నారని ఆరోపిస్తు సీబీఐ కేసు నమోదు చేసింది.
దానికి సంబంధించి సరైన పత్రాలను ఆయన అందజేయలేక పోయారని సీబీఐ తెలిపింది. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను 2020లో కోర్టులో డీకే శివకుమార్ సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దర్యాప్తుపై తాత్కాలికంగా స్టే విధిస్తున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది.
ఈ కేసులో దర్యాప్తుపై విధించిన నిషేధాన్ని ఎత్తి వేయాలంటూ సుప్రీం కోర్టులో సీబీఐ ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానంలో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో సీబీఐ విచారణపై ఉన్న నిషేధాన్ని తొలగించేందుకు సుప్రీం కోర్టు సోమవారం నిరాకరించింది. ఈ కేసులో డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ కు జస్టిస్ అనిరుద్దబోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. నోటీసులపై నవంబర్ 7లోగా స్పందించాలని ఆయన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.