ఎన్నికలు వచ్చాయంటే చాలు ఓటర్లను ఆకర్షించడానికి నేతలు ఎన్నో పాట్లు పడతారు. ఒకవైపు పార్టీ ప్రచారం నిర్వహిస్తూనే ఓటర్లకు పనుల్లో సహాయం చేస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణలో (Telangana) పర్యటిస్తున్న కాంగ్రెస్ (Congress)అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ప్రజల్లో ఒకరిగా కలిసిపోయి వారి కష్టాల్లో పాలుపంచుకోవడం తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంది.
అయితే నేడు కరీంనగర్ V-పార్క్ (Karimnagar V-Park) నుంచి మొదలైన కాంగ్రెస్ విజయ భేరి యాత్రలో భాగంగా జగిత్యాలకు (Jagityala) వెళుతోన్న రాహుల్ మార్గం మధ్యలో ఉన్న నూకపల్లి NAC స్టాప్ వద్ద ఆగారు. స్కూటీపై వెళుతున్న ప్రయాణికులతో ముచ్చటించి, చిన్నారులకు చాక్లెట్స్ అందించారు. కాసేపు వారితో మాట్లాడిన రాహుల్ పక్కనే వున్న టిఫిన్ బండి వద్దకు వెళ్లి దోస పిండి తీసుకుని దోసె వేశారు. అనంతరం జగిత్యాలకు పయనం అయ్యారు.
మరోవైపు తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని జనసమితి పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీని ప్రొఫెసర్ కోదండరామ్ కలిశారు. ప్రస్తుతం కరీంనగర్ లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీతో కోదండరామ్ భేటీ అయ్యారు. అనంతరం జగిత్యాల కార్నర్ మీటింగ్ లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ బయలుదేరారు.