విజయవాడలో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ పోలీసుల పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఖాకీ డ్రెస్ అంటే త్యాగానికి ప్రతీక అంటూ.. పోలీస్ అంటే ఖాకీ.. ఖాకీ అంటే పోలీస్.. ఈ రెండింటికి విడదీయరాని అనుబంధం ఉందని జగన్ తెలిపారు. నిత్యం సవాళ్ళతో కూడుకొన్న పోలీస్ ఉద్యోగంలో.. క్షేమంగా ఇల్లు చేరుతామనే నమ్మకం కూడా ఉండదని అన్నారు.
ఒత్తిళ్లు, సవాళ్ళు ఈ రెండు పోలీస్ ఉద్యోగంలో రెండు కత్తుల లాంటివని సీఎం జగన్ తెలిపారు. విధినిర్వహణలో గాయాలు కావచ్చు.. ప్రాణాలు పోవచ్చు.. ఇవన్నీ దాటుకొని విధులు నిర్వహించే వారే పోలీసులని సీఎం అన్నారు. అలాంటి పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మరోవైపు అక్టోబర్ 21 పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి నివాళులర్పించారు వైఎస్ జగన్..
మరోవైపు నేరం తన రూపు మార్చుకుంటున్న ప్రస్తుత రోజుల్లో పోలీస్ ఉద్యోగంపై బాధ్యతలు పెరిగాయన్నారు జగన్.. ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ వల్ల సైబర్ సెక్యూరిటీ నుంచి డేటా చోరీ వరకు నేరాలు జరుగుతున్నాయని.. ఈ పరిస్థితుల్లో పోలీసులు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందన్నారు జగన్. ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్ నెట్ వాడకం ద్వారా సైబర్ ప్రపంచంలో చీకటి ప్రపంచం సృష్టించుకున్న నేరస్తులను ఎదుర్కోవాల్సిన బృహత్తర బాధ్యత పోలీసులపై ఉందన్నారు సీఎం వైఎస్ జగన్..