ఆత్మహత్య చేసుకున్న ఓ లేడీ కానిస్టేబుల్(Lady constable) ఒంటిపై ఏకంగా 500 చోట్ల గాయాల గుర్తులు ఉండడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలు, ఆమె శరీరంపైకి ఆ గాయాలు ఎలా వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని పోలీస్ లైన్‌లోని వసతి గృహంలో నివాసముంటున్న లేడీ కానిస్టేబుల్ మీను గురువారం తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి యత్నించింది. అక్కడే ఉన్నవారు అప్రమత్తమై ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. అనంతరం ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ నివేదికలో కానిస్టేబుల్ మీను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.
పోస్టుమార్టం రిపోర్టులో మీనుది ఆత్మహత్యగా నిర్ధారణ అయినప్పటికీ ఆమె మృతదేహంపై 500కు పైగా గాయాల గుర్తులు ఉండడం చూసి డాక్టర్లు సైతం కంగుతిన్నారు. అలీగఢ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌తో మీను ప్రేమలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అయితే ఆ వ్యక్తి మీనును మోసం చేసి వేరే మహిళను పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.
మీను అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వనట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన మీను.. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తనను తాను హింసించుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. విచారణలో ఎవరు తప్పు చేసినట్లు తేలినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబసభ్యులు మాట్లాడడానికి నిరాకరించారు.