ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ మతం, హిందూ ధర్మం వేరని.. ధర్మాన్ని నమ్మేవాడే గుడికి రావాలని అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సర్వం శక్తి మయం’ వెబ్ సిరీస్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న హరీష్ శంకర్ హిందూ ధర్మరం, సనాతన ధర్మంపై అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
చాలా మంది సగం హిప్పోక్రసీతో బతుకుతుంటారని.. దేవుడు ఉన్నాడు.. అని నమ్మే భక్తులు, దేవుడు లేడు.. అనుకునే నాస్తికులకు మధ్య వ్యత్యాసాన్ని ఓ ఉదాహరణతో వివరించారు. ‘మూడో తరగతి పిల్లాడికో, ఐదేళ్ల పిల్లాడికో పైథాగరస్ సిద్ధాంతం, న్యూటన్ సిద్ధాంతం గురించి చెప్తే అర్థం కాదు.. అలాగని ఆ సిద్ధాంతం లేనట్టా?’ అని ప్రశ్నించారు. భగవంతుడి కాన్సెప్ట్ కూడా అంతేనని తెలిపారు.
‘నీకు అర్థం కానంత మాత్రాన అది సగం లేదని కాదు.. నాకు దేవుడంటే నమ్మకం లేదండి.. కానీ ఏదో ఒక శక్తి ఉందండి అంటారు. నువ్వు ఏ శక్తిని తీసుకున్నా అది దేవుడితో ముడిపడి ఉంటుంది.. శక్తిని మనం చూడలేం. ఆస్వాదిస్తామంతే.. భగవంతుడినీ అంతే మనం చూడలేం..’ అని తెలిపారు. ఇదే విషయాన్ని ‘సర్వం శక్తి మయం’ వెబ్ సిరీస్‌లో చెప్పారని ఆయన వెల్లడించారు.
‘హిందూ మతం వేరు.. హిందూ ధర్మం వేరు.. భారత దేశం హిందూ మతంతో ఉన్నప్పటికీ హిందూ ధర్మం మీద నిలబడిన దేశం’ అని తెలిపారు. హిందూ మతం బొట్టుపెట్టండి అని చెబుతుంది.. పక్కోడికి అన్నం పెట్టండి అని చెబుతుంది.. అన్నం తినే ఆ పక్కోడికి బొట్టు ఉందా? లేదా? అని కూడా చూడదు.. పరమత సహనం అనేదీ హిందూ ధర్మంలోనే ఉంది..’ అని వ్యాఖ్యానించారు.
ఇటీవల సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి కూడా పరోక్షంగా విమర్శలు చేశారు హరీష్ శంకర్. ‘సనాతన ధర్మాన్ని విమర్శించడం, ఆలయాల మీద కామెంట్లు చేయడం ఈ మధ్య ఫ్యాషనైపోయిందన్నారు. భక్తి అనేది పూర్తిగా వ్యక్తిగతమని, ఆ నమ్మకం ఉన్నవాళ్లు మాత్రమే అక్కడకు వెళ్లాలన్నారు. చాలా మంది సెక్యులర్ ముసుగు వేసుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు’ అని హరీష్ శంకర్ చురకలు అంటించారు.