వన్డే ప్రపంచకప్(One day world cup) లో టీమిండియా (Team india) మరో పోరుకు సిద్ధమైంది. వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన ఐదో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. భారత్, న్యూజిలాండ్ (IND VS NZ) మధ్య జరిగే ఈ మ్యాచ్ ధర్మశాల వేదికగా ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రపంచ రికార్డును బద్దలుకొట్టే అవకాశాలున్నాయి. అందుకు గిల్ 14 పరుగుల దూరమే మిగిలి ఉంది.
వన్డే ఫార్మాట్లో ఇప్పటివరకు 37మ్యాచ్‌లు ఆడిన శుభ్‌మన్ గిల్ 64 సగటుతో 1,986 పరుగులు చేశాడు. మరొక 14 పరుగులు చేస్తే 2 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. అయితే ఆ 14 పరుగులను మరొక రెండు ఇన్నింగ్స్‌ల్లోనే సాధిస్తే వన్డే ఫార్మాట్లో వేగంగా 2 వేల పరుగులు సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు హషీమ్ ఆమ్లా ప్రపంచ రికార్డును గిల్ బద్దలుకొడతాడు.
ప్రస్తుతం అత్యంత వేగంగా 2 వేల పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఆమ్లా మొదటి స్థానంలో ఉన్నాడు. 40 ఇన్నింగ్స్‌ల్లోనే 2 వేల పరుగులు చేసిన ఆమ్లా వేగంగా ఈ మార్కు అందుకున్న బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అయితే ఆ 14 పరుగులను గిల్ నేడు న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లోనే సాధించే అవకాశాలున్నాయి. అదే జరిగితే నేటి మ్యాచ్‌లోనే గిల్ ఈ ప్రపంచ రికార్డు నెలకొల్పడం ఖాయం.
తన కెరీర్లో 19వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే 1,000 పరుగులు పూర్తి చేసిన గిల్.. అత్యంత వేగంగా ఈ మార్కు అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 22 వన్డే మ్యాచ్‌లాడిన గిల్ 1,299 పరుగులు చేశాడు. ఇక ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన గిల్ 69 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు.