ప్రపంచంలో బంగారానికి ఒక ప్రత్యేకమైన విలువ ఉంది. బంగారం అంటే దాదాపుగా ఇష్టపడని వారు ఉండరు. అందుకే కావచ్చు కొందరు విదేశాల నుంచి అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నారు. దొడ్డి దారిలో ఇలాంటి అక్రమాలు ఎన్ని జరుగుతున్నాయో తెలియదు కానీ.. విమానాశ్రయాల్లో మాత్రం స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా దొరికిపోతున్నారు.
ఇలా ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో (Airport) లెక్కలేనంత బంగారం దొరికింది.. ఇంకా దొరుకుతున్నాయి. మరోమారు శంషాబాద్ (shamshabad)లోని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారుగా రూ.32.8లక్షలు విలువగల బంగారాన్ని పట్టుకొన్నారు అధికారులు.. దుబాయి నుంచి హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి దాదాపు కిలో బంగారాన్ని (Gold) స్వాధీనం చేసుకున్నారు.
దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానంతో అతని లగేజీ బ్యాగును స్కాన్ చేశారు కస్టమ్స్ అధికారులు. అందులో 610 గ్రాముల బంగారం కనిపించడంతో స్వాధీనం చేసుకొన్నారు అధికారులు.. కాగా ఆ బంగారం విలువ రూ.32.8లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే మరో ప్రయాణికుడి నుంచి కూడా 483 గ్రాముల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వివరించారు.