నమ్మేవాడు ఉంటే మోసం చేసే వాడు కూడా ఉంటాడన్నది పెద్దల మాట.. అసలు మోసాలు నమ్మించడం ద్వారా సులువుగా జరుగుతాయి.. కానీ నమ్మకంతో పాటు ఆశ ఉంటే మోసగాడి పంట పండినట్టే.. నేటి పరిస్థితుల్లో ఈ ఆశ వల్ల లక్షలు పోగొట్టుకొన్న సందర్భాలు ఉన్నాయి.. ఇల్లు కాలి బూడిద అయినాక ఫైరింజన్ కి ఫోన్ చేసినట్టుగా.. నిండా మునిగాక పోలీసులను ఆశ్రయించడం కామన్ గా మారింది. కాగా ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండ్ నడుస్తుంది. యూట్యూబ్ లో ఏది కనిపిస్తే అది నొక్కడం చేతులకు బాగా అలవాటు అయ్యింది. ఈ అలవాటే ఓ వ్యక్తిని నిండా ముంచిది. ఆ వివరాలు చూస్తే..
కుమార్ అనే వ్యక్తి, గురుగ్రామ్ (Gurugram)కు చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్ (WhatsApp) ద్వారా లింక్ పంపాడు. యూట్యూబ్ (Youtube) కంటెంట్ ను లైక్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ఆర్జించవచ్చని నమ్మించాడు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభాలు వస్తాయని మభ్యపెట్టాడు. అది నిజమని నమ్మిన ఆ వ్యక్తి పలుమార్లు ఇన్వెస్ట్ చేస్తూ పెద్ద మొత్తంలో నష్టపోయాడు.
ఈ మోసగాళ్ళు ఇదే విధంగా మరి కొందరిని మోసం (Fraud)చేసి పెద్ద మొత్తంలో బురిడీ కొట్టించారు. ఇలా పలువురి నుంచి సుమారుగా రూ.73 లక్షలు కాజేసినట్టు తెలిసింది.. అయితే ముఠా సభ్యుల్లో ఒకరైన 28 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. యూట్యూబ్, మోజ్ యాప్ ల పేరుతో ఈ గ్యాంగ్ ఆన్ లైన్ మోసానికి తెరతీసిందని పోలీసులు తెలిపారు. కాగా అరెస్టు అయిన నిందితుడు హరియాణాకు చెందిన సోనేపట్ వాసి అజయ్ కుమార్ అని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.