యుద్ధం వల్ల ఎంతటి భయానక పరిస్థితులు తలెత్తుతాయో గాజా పట్టిని చూస్తే అర్థమవుతుంది. తీవ్రవాద సంస్థ హమాస్(Hamas)కు, ఇజ్రాయెల్ (Israel) కు మధ్య యుద్ధం జరుగుతుంటే సామాన్యులే ఇందులో సమిథలవుతున్నారు. ఇప్పటివరకు అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా వేలల్లో క్షతగాత్రులకు చికిత్స చేసేందుకు గాజాలోని ఆసుపత్రులు, వాటిలోని సౌకర్యాలు ఏమాత్రం సరిపోవడంలేదు. గాయాల బాధకు చిన్నారుల రోధనలు కంటతడిపెట్టిస్తున్నాయి.
హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకార దాడులతో ధ్వంసమవుతున్న గాజా దుర్భరంగా మారుతోంది. విద్యుత్ కోతలు, ఇంధనం కొరత కారణంగా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి ఆహారం, నీరు కూడా అరకొరగానే అందుతున్నాయి. అది కూడా ఈజిప్టు నుంచి వస్తున్న సాయమే. ఇజ్రాయెల్ మాత్రం ఆహారం, నీరు మాత్రమే పంపుతోంది. ఇంధనం పంపేందుకు అంగీకరించడంలేదు.
గాజాలో నగరంలోని అల్ షిఫా ఆసుపత్రి క్షతగాత్రులతో నిండిపోయింది. ఇంధనం కొరత కారణంగా పలు ఆస్పత్రుల్లో శిశువుల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఇంక్యుబేటర్లలో ఉన్న శిశువుల విషయంలో ఎన్ఐసీయూ వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఇంక్యుబేటర్లలో ఉన్న 55 మంది చిన్నారులను కాపాడుకోలేమని ఓ వైద్యుడు కన్నీరు పెట్టుకున్నారు. సోమవారం సైతం ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాయపడిన అనేక మందిని అక్కడికి తీసుకొచ్చారు.
అక్టోబర్ 7 నుంచి ప్రారంభమైన ఈ మారణహోమంలో ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 5,087మంది పాలస్తీనా పౌరులు మృతిచెందినట్లు గాజా అధికారులు వెల్లడించారు. వీరిలో 2,055 మంది చిన్నారులు, 1,119 మంది మహిళలే ఉన్నారన్నారు. మరోవైపు 15వేల మందికి పైగా పౌరులు గాయపడినట్లు తెలిపారు.