దేశంలోనే అతిపెద్ద గిరిజన ఆదివాసీ జాతర మేడారం (Madaram) జాతరకు ఎన్నికల కోడ్ (Election Code) అడ్డంకిగా మారింది. ప్రతి రెండేండ్ల కోసారి ఈ జాతరను నిర్వహిస్తూ వుంటారు. ఈ సారి వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు ఈ జాతరను నిర్వహించనున్నారు. ఈ జాతర నిర్వహణ కోసం రూ.75 కోట్లతో అధికారులు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు.
ఈ సారి ఎన్నిలక కోడ్ అమలులోకి రావడంతో నిధుల విడుదలకు ఆమోదం లభించలేదని తెలుస్తోంది. దీంతో నిధుల విడుదల కాక పోవడంతో జాతర పనులు ముందుకు సాగడం లేదు. వరదల నేపథ్యంలో గతంలో చేపట్టిన నిర్మాణాలు, రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి.
చాలా చోట్ల విద్యుత్ స్థంబాలు పడిపోయాయి. నీటి ట్యాంకులు, స్నానపు ఘట్టాలు, కల్యాణ కట్టలు, భక్తుల కోసం షెడ్లు ఇలా పనులను చేపట్టాల్సి ఉంది. కేవలం మూడు నెలలు సమయం ఉన్నా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. దీంతో అసలు జాతర సమయానికైనా ఈ పనులు పూర్తవుతాయా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఎన్నికల నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు సైతం ఇప్పటి వరకు పనులపై ఎలాంటి సమీక్ష జరపలేదు. జాతర పనుల కోసం ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుని, నిధులు కేటాయించే అవకాశం ఉంది. అలా చేస్తే జాతర పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ అలా కాకుండా ఎన్నికల తరవాత జాతర చేపడితే పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు తక్కువగా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మరో వైపు ఎన్నికల నేపథ్యంలో అటు జిల్లా అధికారులు కూడా పనుల పురోగతిపై పెద్దగా సమీక్షలు నిర్వహించడం లేదని అంటున్నారు. జాతర కోసం ప్రత్యేక అధికారులను నియమించి, పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయవచ్చని ఆలయ అధికారులు అంటున్నారు.