బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA)పల్లా రాజేశ్వర్ రెడ్డి ((Palla Rajeshwar Reddy)పై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. తన రెసిడెన్షియల్ ప్లాట్‌ను ఆక్రమించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారంటూ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ కారిడార్ పోలీసు స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
ఘట్ కేసర్లోని చౌదరిగూడలో తన రెసిడెన్షియల్ ప్లాట్ స్థలాన్ని కబ్జా చేయాలని ఎమ్మెల్యే ప్రయత్నించారని ఉప్పల్ బుద్దనగర్‌కు చెందిన ముచ్చెర్ల రాధిక ఈ నెల 23న ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి తన స్థలాన్ని ఆక్రమించాలని ఎమ్మెల్యే ప్రయత్నాలు చేశారని అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దానిపై ప్రశ్నించినందుకు తనను బెదిరింపులకు గురి చేశారని చెప్పారు.
1984-85లో చౌదరి గూడలో సర్వే నంబర్ 796లో భూమిని 167 ప్లాట్లు చేసి ఆ స్థలం యజమాని ఎంఏ రషీద్ విక్రయించారని రాధిక ఫిర్యాదులో వెల్లడించారు. అందులో 2010లో ఒక ఫ్లాట్‌ను తాను ఊటుకూరు మల్లేశం అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారని తెలిపారు. అప్పటి నుంచి ఆ స్థలం తన పేరిట రిజిష్టర్ అయి ఉందని వెల్లడించారు. దాని చుట్టూ రక్షణ కోసం ప్రహరీని ఏర్పాటు చేశామని చెప్పింది
ఆ ప్లాట్‌లోకి గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్టుకు చెందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆయన భార్య నీలిమ, మరొకరు మధుకర్ రెడ్డి చొరబడ్డారన్నారు. ప్లాట్ చుట్టూ ఉన్న స్థంబాలను తొలగించగా తన భర్తతో కలిసి తాను ఎమ్మెల్యేను ప్రశ్నించానని అన్నారు. దీంతో ఎమ్మెల్యే తనను అసభ్యపదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు దిగారని వెల్లడించారు.
ఎమ్మార్వో కార్యాలయంలో నకిలి పత్రాలు సృష్టించి లేఔట్ వివరాలను పూర్తిగా మార్చి వేశారని ఆరోపించారు. ఆ స్థలాన్ని వ్యవసాయ భూమిగా మార్చారని, ఇప్పడు ఆ భూమి గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్టుకు చెందినదని అంటున్నారని పేర్కొన్నారు. రాధిక ఇచ్చిన ఫిర్యాదుపై ప్రాథమిక దర్యాప్తు చేసిన పోలీసులు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు ఆయన భార్య నీలిమ, మరో వ్యక్తి మధుకర్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.