మనిషిలో ఆశ ఉన్నంతకాలం మోసం చేసే వారు కూడా పక్కనే ఉంటారు. ఎందుకంటే ఆశ అనేది మోసగాళ్ళకు పెట్టుబడి కాబట్టి. ముఖ్యంగా అతి తక్కువకాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశ, అవకాశాల కోసం వెతికే, ఉద్యోగం లేని నిరుద్యోగులు (Unemployed) మోసాగాళ్లకు ఎక్కువగా టార్గెట్ అవుతుంటారు.
నేటి కాలంలో ఇలాంటి ఛీటర్స్ అడుగడుగునా తారసపడుతుంటారు. ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. నిరుద్యోగ యువకులను టార్గెట్ చేస్తూ టాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant) ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఘరానా మోసాలకు పాల్పడుతున్న నకిలీ అటవీ శాఖ ఆఫీసర్ను చర్లపల్లి పోలీసులు (Charlapally Police) అరెస్టు చేశారు.
గతంలో ఖమ్మం అటవీ శాఖ అవుట్సోర్సింగ్ లో విధులు నిర్వహించిన హైదరాబాద్ (Hyderabad) యూసఫ్ గూడా కు చెందిన కొనకంచి కిరణ్ కుమార్ అనే వ్యక్తి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో నకిలీ ఆఫీసర్ అవతారం ఎత్తాడు. ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం గ్రామానికి చెందిన కిరణ్ చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి మోసగాడిగా మారాడు. ఈ క్రమంలో చర్లపల్లి కి చెందిన బాధితుడు బోయిని సంతోష్ కి టాక్స్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం ఇప్పిస్తాని ఆశ చూపి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసాడు.
ఇలా మరికొంత మందిని మోసం చేయడంతో నిజాన్ని గ్రహించిన బాధితులు పోలీస్ స్టేషన్ కి క్యూ కట్టారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు నిందితుడు కిరణ్ ని అదుపులోకి తీసుకుని చర్లపల్లి జైలుకు తరలించినట్లుగా వెల్లడించారు. అతని వద్ద నుంచి అటవీశాఖ నకిలీ గుర్తింపు కార్డు యూనిఫామ్, బొమ్మ పిస్తోల్ తో సహా బైక్ సెల్ ఫోన్ కంప్యూటర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉంటాలని పోలీసులు ప్రజలని హెచ్చరించారు.