ఖమ్మంలో భారీగా నగదును పోలీసులు (Police) పట్టుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం శ్రీరామ్ నగర్ (Sri Ramnagar) వద్ద ఓ ఇంట్లో భారీగా నగదు నిల్వ చేసినట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఆ ఇంటికి వెళ్లింది. అక్కడ పెద్ద ఎత్తున నగదును పోలీసులు సీజ్ చేశారు. అధికారుల వివరాల ప్రకారం…
వరంగల్ క్రాస్ రోడ్డులోని శ్రీరామ్ నగర్లో ఇంటి నెంబర్ 6-156/7/1 లో పెద్ద ఎత్తున నగదు నిల్వ ఉంచినట్టు నిన్న పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ కలిసి ఆ ఇంటి వద్దకు వెళ్లారు. పోలీసుల రాకను గమనించి ఇద్దరు వ్యక్తులు ఇంటి వెనుక గోడ దూకి తప్పించుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
వెంటనే సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖకు అందజేశారు. సమాచారం అందుకున్న ఐటీ అధికారులు ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న మహిళ సమక్షంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నోట్ల కట్టలతో కూడిన మూడు బ్యాగులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మహిళను చుండు కరుణ (48)గా గుర్తించామని అధికారులు తెలిపారు. తన బంధువు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టు మేనేజర్ జగ్గవరపు శ్రీకాంత్ రెడ్డి, ఆ కంపెనీ ఎండీ పొంగులేటి ప్రసాద రెడ్డి (కాంగ్రెస్)లు మూడు డబ్బుల సంచులను తన ఇంట్లో పెట్టారని చెప్పిందన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయం కోసం ఓటర్లకు పంచేందుకు ఈ సంచులను తన ఇంట్లో ఉంచారని విచారణలో తెలిపిందన్నారు.
కేవలం కాంగ్రెస్ పై ఉన్న అభిమానంతోనే తాను ఆ బ్యాగులను ఇంట్లో పెట్టుకున్నానని వెల్లడించిందన్నారు. డబ్బుల సంచులను తీసుకు వెళ్లేందుకు ఇద్దరు వ్యక్తులు నిన్న రాత్రి తన ఇంటి వద్దకు వచ్చారని, కానీ పోలీసుల రాకను గమనించి అక్కడి నుంచి పరారయ్యాని విచారణలో అంగీకరించిందన్నారు.
డబ్బులతో కూడిన బ్యాగులు, కాంగ్రెస్ పార్టీ కండువాలు, జెండాలను ఐటీ అధికారులు పరిశీలించారు. మధ్యవర్తుల సమక్షంలో డబ్బును అధికారులు లెక్కించారు. మొత్తం రూ. 3 కోట్ల రూపాయలు ఉన్నట్టు నిర్దారించారు. అనంతరం ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.