దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే తొమ్మిది సార్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఈడీ (ED) నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన ఏదో ఒక సాకుతో ఇంతకాలం తప్పించుకొన్నారు.. కానీ నేడు ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. ఈడీ అధికారులు కేజ్రీవాల్ కి షాకిచ్చారు.. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు..
కొద్దిసేపటి క్రితం కేజ్రీవాల్ ఇంటికి చేరుకొన్న 8 మంది ఈడీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగేందర్ నేతృత్వంలో ఈ రెయిడ్స్ జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు ఈడీ అధికారులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను నేడు హైకోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది.
కోర్టు ఆర్డర్స్ వచ్చిన కొద్ది గంటల్లోనే ఈడీ అధికారులు సీఎం ఇంటికి చేరుకొన్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారనే వార్తలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న క్రమంలో అధికారులు ఆయన ఇంటి వద్ద, ఢిల్లీ ఈడీ కార్యాలయం వద్ద భారీ బందో బస్తును ఏర్పాటు చేశారు.. మరోవైపు కేజ్రీవాల్ ఇంటికి ఈడీ వచ్చిన విషయం తెలుసుకొన్న ఆప్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి తరలి వస్తున్నారు.
దీంతో కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇక ఢిల్లీ హైకోర్టులో గురువారం కేజ్రీవాల్‌కు చుక్కెదురైన విషయం తెలిసిందే. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈడీ అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని తెలిపింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22న చేపట్టనున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ కేసులో ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అదేవిధంగా కవితను సైతం అధికారులు అదుపులోకి తీసుకొన్న సంగతి తెలిసిందే..