విపక్ష ఇండియా కూటమిలో ఆరంభంలోనే ప్రధాని అభ్యర్ధిత్వం పట్ల గందరగోళం నెలకొంది. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధిగా రాహుల్ గాంధీ ముందుకొస్తారని కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లోత్ ఇటీవల ప్రకటించగా, బిహార్ సీఎం నితీష్ కుమార్ అభ్యర్ధిత్వంపైనా హాట్ డిబేట్ సాగుతోంది.
తాజాగా ప్రధాని అభ్యర్ధిగా తాము ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కోరుకుంటున్నామని ఆప్ ప్రతినిధి ప్రియాంక కక్కర్ వ్యాఖ్యానించారు. ముంబైలో ఇండియా కూటమి భేటీకి ముందు ప్రియాంక చేసిన వ్యాఖ్యలు విపక్ష శిబిరంలో దుమారం రేపుతున్నాయి.
ప్రియాంక బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని అభ్యర్ధిగా తాను అరవింద్ కేజ్రీవాల్ వైపు మొగ్గుచూపుతానని, ఆప్ కన్వీనర్ ప్రజల సమస్యలను మెరుగ్గా హైలైట్ చేస్తారని, ప్రధాని నరేంద్ర మోడీకి దీటైన సవాల్‌గా కేజ్రీవాల్ ఒక్కరే నెగ్గుకొస్తారని పేర్కొన్నారు.
మోదీ విద్యార్హతలు సహా ఏ అంశంలోనైనా కేజ్రీవాల్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు స్పష్టంగా వెల్లడిస్తారని గుర్తుచేశారు. ముంబైలో బుధ, గురువారాల్లో ఇండియా కూటమి భేటీ కానున్న నేపధ్యంలో ఆప్ నేత వ్యాఖ్యలు విపక్ష కూటమిలో చర్చకు తెరలేపాయి.
దేశాన్ని నూతన ఒరవడిలో ఇండియా కూటమి నడిపిస్తుందని ప్రియాంక కక్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిత్యావసరాలు, ఆహారోత్పత్తుల ధరలు పెరిగినా దేశ రాజధానిలో ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం ఆప్ ప్రభుత్వ ఘనతేనని ఆమె చెప్పుకొచ్చారు.