ఆప్ కీలక నేతల ఇండ్లపై ఈడీ (ED) మంగళవారం దాడులు చేసింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) వ్యక్తిగత కార్యదర్శి బిబవ్ కుమార్ నివాసంలో ఈడీ తనిఖీలు నిర్వహించింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆప్ రాజ్య సభ ఎంపీ ఎన్డీ గుప్తా నివాసంతో పాటు ఇతర నేతల నివాసాల్లో ఈడీ సోదాలు చేసింది.
వాటర్ బోర్డు మాజీ సభ్యుడు శలభ్ కుమార్ నివాసంలో కూడా ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ జల్ బోర్డులో అక్రమాలకు సంబంధించి ఈ దాడులు చేసినట్టు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం 12 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణకు హాజరు కావాలని సీఎం కేజ్రీవాల్‌కు ఐదవ సారి ఈడీ సమన్లు పంపింది.
కానీ సీఎం కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరు కాలేదు. ఈ క్రమంలో దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ జల్ బోర్డులో టెండర్ ప్రక్రియలో జరిగిన ప్రక్రియకు సంబంధించి ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఒక కేసు… ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మరో కేసు నమోదు చేసింది.
ఢిల్లీ జల బోర్డు అధికారులు ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఫ్లో మీటర్ల సరఫరా, ఇన్ స్టాలేషన్, టెస్టింగ్, కమీషన్ కోసం టెండర్లను ఓ సంస్థకు కేటాయించే సమయంలో అనవసర ప్రయోజనాలు కల్పించారని సీబీఐ ఎఫ్ఐర్లో అభియోగాలు మోపింది. టెక్నికల్ అర్హత ప్రమాణాలు లేక పోయినప్పటికీ సదరు కంపెనీకి రూ.38 కోట్ల అక్రమ కాంట్రాక్టులు కట్టబెట్టారని సీబీఐ ఆరోపించింది.