జైలులో ఉన్న ఆప్ నేత సంజయ్ సింగ్ (Sanjay Singh)కు భారీ షాక్ తగిలింది. రాజ్యసభ ఎంపీగా సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు. సంజయ్ సింగ్ ప్రమాణానికి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ( Jagdeep Dhankhar)అనుమతించకపోవడంతో సంజయ్ సింగ్ ప్రమాణం చేయలేకపోయారు.
తాజాగా దీనిపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ వివరణ ఇచ్చారు. ఈ విషయం ప్రస్తుతం ప్రివిలేజ్ కమిటీ పరిశీలనలో ఉందని చెప్పారు. సంజయ్ సింగ్ పై నమోదైన సభా హక్కుల ఉల్లంఘనల కేసును ప్రివిలేజ్ కమిటీ దర్యాప్తు జరుపుతోందని వివరించారు. గతేడాది జూలై 24న సభా నియమాలను ఉల్లంఘించినందుకు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
మనీలాండరింగ్ కేసులో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఆయన్ని మరోసారి రాజ్యసభకు నామినెట్ చేస్తూ ఆప్ నిర్ణయం తీసుకుంది. ఆయనతో పాటు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతీ మాలీవాల్తో పాటు చార్చెట్ అకౌంటెంట్ నరైన్ దాస్ గుప్తాను రాజ్యసభకు నామినెట్ చేసింది. ఈ క్రమంలో రాజ్య సభ ఎంపీగా ప్రమాణం చేసేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.
ఈ మేరకు ఫిబ్రవరి 1న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఆయన పిటిషన్ వేశారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందకు తనకు ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కానీ ఆ తర్వాత కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే బెయిల్ కావాలని దరఖాస్తులో మార్పులు చేశారు. ఈ క్రమంలో సోమవారం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా రాజ్యసభ చైర్మన్ నిర్ణయం నేపథ్యంలో ఆయన ప్రమాణనం చేయలేకపోయారు.