టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) విషయంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్(AB de Villiers) చెప్పిన ఓ మాటను వెనక్కి తీసుకున్నాడు. విరాట్-అనుష్క శర్మ దంపతుల గురించి తాను చెప్పిందంతా అబద్దం అని, కోహ్లీ వ్యక్తిగత విషయాలను యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడి తాను పెద్ద తప్పు చేశానని పేర్కొన్నాడు.
వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్(England)తో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు విరాట్ దూరం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ కుటుంబ సభ్యుల గురించి సోషల్ మీడియాలో పలు వదంతులు వ్యాపించాయి. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గర్భవతి అని, అందుకే కోహ్లీ ఇంగ్లండ్‌తో జరిగే మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడడంలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
అయితే, కోహ్లీ తల్లి అనారోగ్యంతో బాధపడడమే ఆ మ్యాచ్‌లు ఆడకపోవడానికి కారణంగా మరో వార్త వైరల్ అయింది. అయితే తమ తల్లి సరోజ్ కోహ్లీ ఆరోగ్యంగానే ఉన్నారని విరాట్ సోదరుడు వికాస్ స్పష్టం చేశాడు. అదే సమయంలో తన యూట్యూబ్ ఛానెల్‌లో ఏబీ డివిలియర్స్ మాట్లాడుతున్న సందర్భంలో విరాట్ గురించి ప్రస్తావన రాగా విరుష్క దంపతులకు త్వరలో రెండో బిడ్డ రానుందని తెలిపాడు.
తాజాగా ఆ మాటను వెనక్కి తీసుకున్నాడు. ‘‘నా యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ నేను ఓ పెద్ద తప్పు చేశా. ఆరోజు నేను చెప్పిందంతా అబద్ధం. అందులో ఏమాత్రం నిజం లేదు. విరాట్ కుటుంబానికి ఏది మంచిదో అదే జరగాలని కోరుకుంటున్నా. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. విరాట్ విరామానికి కారణం ఏమైనప్పటికీ అతడు మరింత రెట్టించిన ఉత్సాహంతో మైదానంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నా’’ అని ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
— Sanju Here 🤞| Alter EGO| (@me_sanjureddy) February 9, 2024