హెచ్ఎండీఏ (HMDA)మాజీ డైరెక్టర్ శివ బాల కృష్ణ (Shiva Bala Krishna) నివాసంలో ఏసీబీ రెయిడ్స్ జరిగాయి. మొత్తం 14 బృందాలు తనిఖీల్లో పాల్గొన్నాయి. శివ బాల కృష్ణతో పాటు ఆయన సన్నిహితుల ఇండ్లలోనూ ఏసీబీ సోదాలు చేసింది. అమీర్ పేట్‌లోని హెచ్ఎండీఏ కార్యాలయంలోనూ ఏసీబీ తనిఖీలు నిర్వహించింది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. వందల కోట్ల రూపాయల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో బాలకృష్ణ కీలక స్థానంలో పనిచేశారు. ఆయన తన పదవిని అడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున్న ఆస్తులు కూడా బెట్టారని ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఇప్పటి వరకు రూ.100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను ఏసీబీ గుర్తించినట్టు సమాచారం. దీంతో పాటు బంగారం, ఫ్లాట్స్, బ్యాంకు డిపాజిట్లు, బినామీల వివరాలను ఏసీబీ గుర్తించినట్టు తెలుస్తోంది. సోదాల సమయంలో ఏసీబీకి బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఎవరూ సహకరించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
రేపు కూడా తనిఖీలు కొనసాగుతాయని ఏసీబీ వర్గాల ద్వారా తెలుస్తోంది. బాలకృష్ణపై అవినీతి ఆరోపణలు వచ్చాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆరోపణలపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. బాలకృష్ణ ఏసీబీ విచారణకు సహకరించడం లేదన్నారు. ఇంట్లో డాక్యుమెంట్లు సీజ్ చేశామని వెల్లడించారు.