విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్(Vijayawada bus stop)లో బస్సు బీభత్సం సృష్టించింది. ప్లాట్‌ఫాంపై బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం(Accident)లో ముగ్గురు ప్రయాణికులు బస్సు టైర్ల కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన ఏసీ సర్వీసు బస్సు విజయవాడ ఆటోనగర్ డిపో నుంచి నెహ్రూ బస్టాండ్‌లోకి వచ్చింది. ఉన్నట్టుండి ప్లాట్‌ఫాం పైకి బస్సు అతివేగంగా దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో బస్సు చక్రాల కింద పడి ముగ్గురు బలయ్యారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బస్సు ప్రమాదం ధాటికి ప్రాంగణంలోని బారికేడ్లు,కుర్చీలు ధ్వంసమయ్యాయి. దుకాణాల్లోకి కూడా దూసుకెళ్లడంతో వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి.
బ్రేక్ పడకపోవడం వల్లే బస్సు దూసుకొచ్చిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. బస్టాండ్‌లో పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ.. బస్సు ప్రమాదం దురదృష్టకరమన్నారు. ప్రమాదానికి గల కారణాలపై రెండు వాదనలు వినిపిస్తున్నాయని వెల్లడించారు. 24గంటల్లో పూర్తి విచారణ చేస్తామని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. గాయపడిన వారి ఆసుపత్రి ఖర్చు ఆర్టీసీ భరిస్తుందని ఆర్టీసీ ఎండీ చెప్పారు.
ఈ ప్రమాద ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) స్పందించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందడం బాధాకరమన్నారు. కాలంచెల్లిన బస్సుల కారణంగానే రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఒక్క కొత్త బస్సును కొనుగోలు చేయలేదని దుయ్యబట్టారు.
నాలుగున్నరేళ్లుగా ఆర్టీసీ గ్యారేజీలకు ప్రభుత్వం నిధులివ్వడంలేదని ఆరోపించారు లోకేశ్. రిక్రూట్‌మెంట్ కూడా లేకపోవడంతో ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఈ ఘటనకు దీనికి జగన్ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉందని తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రమాద మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు మెరుగైన పరిహారం అందించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.