ఆ చిన్నారి అప్పటి వరకూ అమ్మ తినిపించిన గోరు ముద్దలు తింటూ ఇంట్లో సందడి చేసింది.. బుడిబుడి అడుగులు వేస్తూ స్కూల్‌కు వెళ్తున్న అన్నయ్యకు సెండాఫ్ ఇద్దామని వెళ్లింది. ఇంతలోనే అనుకోని ప్రమాదం బస్సు రూపంలో ఆ చిన్నారి ప్రాణాలను బలిగొంది. ఈ విషాదకరమైన ఘటన హైదరాబాద్(HYD)లోని జవహర్‌నగర్(Javahar Nagar) పరిధిలో చోటుచేసుకుంది. స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
మేడ్చల్ జిల్లా పరిధిలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఆనంద్ నగర్ ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీకి చెందిన విద్యార్థి శనివారం ఉదయం స్కూల్‌కు వెళ్తున్నాడు. అన్నయ్యకు సెండాఫ్ ఇచ్చేందుకు తల్లితో పాటు వెళ్లిన చిన్నారి భవిష్య (3)వెళ్లింది. బస్సు చిన్నారిపైకి దూసుకురావడంతో అక్కడికక్కడే మృతిచెందింది.
దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు అల్లరి మాటలతో సందడి చేసిన చిన్నారి విగతజీవిగా పడి ఉండడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది.
ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన స్కూల్ బస్సులు గల్లీల్లో తిరగాల్సి ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఇదివరకు చాలా చోట్ల బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా చాలా చోట్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఫిట్‌నెస్ లేని బస్సులను నడుపుతున్న స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.