విశాఖ (Visakha) జిల్లాలో తహశీల్దార్ హత్య కేసు సంచలనం సృష్టించింది. ఎమ్మార్వో ఇంటికి వెళ్లిన ఆగంతకుడు అతన్ని రాడ్‌తో కొట్టి చంపేయడం కలకలం రేపుతోంది. అయితే ఈ హత్య ఉదంతంపై ఏపీ టీడీపీ చీఫ్ (AP TDP Chief) అచ్చెన్నాయుడు (Atchannaidu) కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ (YCP) వచ్చాక రాష్ట్రమంతా రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాగం అమలవుతోందని ప్రభుత్వంపై మండిపడ్డారు..
తన ఆర్థిక భద్రతపై ఉన్న శ్రద్ద రాష్ట్రంలోని శాంతి భద్రతలపై సీఎం జగన్ (CM Jagan)కి లేకపోవటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తహశీల్దార్ రమణయ్య హత్య దుర్మార్గమన్న అచ్చెన్నాయుడు.. ఈ ఘటన రాష్ట్రంలోని శాంతి భద్రతలు ఎంత పకడ్బందీగా అమలవుతున్నాయో సూచిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇంట్లోకి వెళ్లి ఒక మండల మేజిస్టేట్‌నే హత్య చేశారంటే.. ఇక రాష్ట్రంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటని నిలదీశారు.
గతంలో ఎన్నడూ ఉత్తరాంధ్రలో ఇలాంటి సంస్కృతి లేదని పేర్కొన్నారు. ప్రజల ఆస్తులకే కాదు, ప్రాణాలకు కూడా జగన్ పాలనలో రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఇంతటి ఘోరాలు నేరాలు జరుగుతుంటే హోమంత్రి, పోలీసులు ఏం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో సగం మందికి హోంమంత్రి ఎవరో అసలే తెలియదని ఎద్దేవా చేశారు. ఈ హత్యపై వెంటనే విచారణ చేపట్టి దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు విశాఖ రూరల్ తహసీల్దార్‌గా ఉన్న రమణయ్య ఎన్నికల నేపథ్యంలో ఇటీవల విజయనగరం జిల్లాలోని బొండపల్లికి బదిలీ అయ్యారు. కొమ్మాదిలోని ఓ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులో నివాసం ఉండే ఆయన.. శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో రాత్రి 10 గంటల ప్రాంతంలో అపార్ట్‌మెంట్ గేట్ వద్ద ఓ వ్యక్తిని కలిసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఈ ఘటన చోటు చేసుకొంది.