– ఇతర పార్టీలను, నేతలను..
– ప్రమోట్ చేయడమేంటి?
– సొంత పార్టీ గురించి చెప్పుకునేది తక్కువ
– అవతలి వాళ్ల గురించి మాట్లాడడం ఎక్కువ
– ఇదేం ప్రచారం..? ఇది దేనికి సంకేతం..?
– బీజేపీ పెద్దలను నిలదీస్తున్న కార్యకర్తలు
విషయం వీక్ గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ లో ఉండాలి. ఎన్నికలప్పుడు అయితే.. ఇది ఓ రేంజ్ లో కొనసాగాలి. కానీ, రాష్ట్రంలో బీజేపీ (BJP) పెద్దల తీరు చూసి ఏం చేయాలో తెలియని అయోమయంలో కిందిస్థాయి కార్యకర్తలు ఉన్నట్టుగా చెబుతున్నారు రాజకీయ పండితులు. ఈ మధ్య కాలంలో కొందరు నేతలు మాట్లాడుతున్న మాటలు చూసి.. ముక్కున వేలేసుకుంటున్నారని వివరిస్తున్నారు.
మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అనేక అంశాలపై మాట్లాడారు. విజయం మాదే, గెలిచేది కాషాయ పార్టీనే అని చెప్పుకుంటే సరిపోయేది. కానీ, బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ గెలిస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే అని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు సొంత పార్టీ క్యాడర్ ను అయోమయంలో పడేశాయని అంటున్నారు విశ్లేషకులు. పార్టీ అధ్యక్షుడు అయి ఉండి ఇలా మాట్లాడడం ఏంటని తెగ చర్చించుకుంటున్నట్టు చెబుతున్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే.. కాంగ్రెస్ కు మాత్రం వేయొద్దు.. తమకు వేయకపోయినా ఫర్లేదు.. బీఆర్ఎస్ గెలిచినా ఓకే అన్నట్టుగా ఉందని సొంత పార్టీ వాళ్లే అనుకుంటున్నారని వివరిస్తున్నారు.
ఇటు, బీసీ సీఎం అని హైకమాండ్ ప్రకటించింది.. అందుకే తాను పోటీ చేయడం లేదని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని అంటున్నారు విశ్లేషకులు. అసలు, బీసీ సీఎం (BC CM) నినాదానికి.. కిషన్ రెడ్డి పోటీ చేయడానికి సంబంధం ఉందా? అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోందని చెబుతున్నారు. ఇవి పార్టీ అధ్యక్షుడు మాట్లాడాల్సిన మాటలేనా?.. ఒకవేళ హైకమాండ్ ఆదేశమే అయినా.. దీన్ని బయటకు చెప్పాల్సిన అవసరం ఏముందని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నట్టుగా వివరిస్తున్నారు విశ్లేషకులు. అసలు, బీసీ సీఎం ప్రకటన లేకపోతే.. తానే సీఎం అభ్యర్థి అని పరోక్షంగా చెప్పుకున్నట్టుగా ఉందని అనుకుంటున్నారని చెబుతున్నారు.
ఓవైపు కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో గందరగోళం నెలకొనగా.. ఇంకోవైపు ఎంపీ అరవింద్ (MP Aravind) చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోసినట్టుగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసు, బీఆర్ఎస్ అవినీతిపై మెతక వైఖరి వ్యవహరిస్తోందని ఆరోపణలు గుప్పిస్తోంది. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే మంచోడు అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. కీలకమైన ఈ ఎన్నికల వేళ ప్రజల్లో కేసీఆర్ పై వ్యతిరేకత బాగా పెరిగిందని చెబుతూనే.. ఇంకోవైపు మంచోడు అని సర్టిఫికెట్ ఇవ్వడం దేనికి సంకేతం అని ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. మొత్తంగా పార్టీ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర నష్టాన్ని తెచ్చి పెడుతున్నాయని కార్యకర్తలు అనుకుంటున్నట్టు చెబుతున్నారు విశ్లేషకులు.