సినీ నటి తాడిమళ్ల గౌతమి బీజేపీకి రాజీనామా చేశారు. భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party)తో తనకున్న పాతికేళ్ల అనుబంధానికి ఇక ముగింపు పలుకుతున్నట్లు ఆమె ప్రకటించారు. బరువెక్కిన హృదయంతో తాను పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు గౌతమి ‘ట్విట్టర్(x) వేదికగా ఓ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామళైకి పంపించారు.
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి చివరి నిమిషంలో మొండిచేయి చూపించారని గౌతమి వాపోయారు. ‘25 సంవత్సరాల క్రితం దేశ నిర్మాణానికి, దాని ప్రయత్నాలను అందించడానికి బీజేపీలో చేరాను.. నా జీవితంలో నేను ఎదుర్కొన్న అన్ని సవాళ్లు ఉన్నప్పటికీ నేను ఆ నిబద్ధతను గౌరవించాను. అయితే ఈ రోజు నేను నా జీవితంలో ఊహించలేని సంక్షోభం నెలకొంది. పార్టీ నుంచి గానీ, పార్టీ నేతల నుంచి గానీ ఎలాంటి మద్దతు లభించలేదు.’ అని వాపోయారు.
ఆర్థిక లావాదేవీల విషయంలో తనను నమ్మించి మోసం చేసిన అళగప్పన్ అనే వ్యక్తికి కొందరు మద్దతు ఇస్తున్నాని.. అందుకే రాజీనామా చేస్తున్నా’ అని గౌతమి పేర్కొన్నారు. 25 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసినా ఎవరి మద్దతు లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిరాశ వ్యక్తం చేశారు గౌతమి. తనకు న్యాయం చేస్తారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పోలీసు, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని తెలిపారు. ఒక ఒంటరి మహిళగా, తన కుమార్తె కోసం పోరాడుతున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే.. నటి గౌతమి ‘దయామయుడు’ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆమె తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన తెలుగు వెబ్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’లో నిత్యామేనన్‌కు తల్లిగా నటించి మెప్పించారు గౌతమి.