సీనియర్ నటి జయప్రద (Jayaprada) కు షాకిచ్చింది తమిళనాడులోని ఎగ్మోర్ కోర్టు (Court). ఓ కేసుకు సంబంధించి విచారణ పూర్తవ్వగా.. ఆరు నెలల జైలుశిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధించింది న్యాయస్థానం.
గతంలో చెన్నై (Chennai) లోని రాయపేటలో ఓ సినిమా థియేటర్ ను నడిపించారు జయప్రద. చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి అన్నారోడ్డులో దీన్ని నిర్వహించారు. అయితే.. ఇందులో పనిచేసిన కార్మికుల నుండి వసూలు చేసిన ఈఎస్ఐ (ESI) మొత్తాన్ని చెల్లించలేదు. నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కార్మికులు ఎగ్మోర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పలు వాయిదాలు పడుతూ వచ్చిన ఈ కేసులో తాజాగా తీర్పు వెలువరించింది న్యాయస్థానం. జయప్రదతో పాటు మరో ముగ్గురికి ఆరు నెలలు జైలు శిక్షతో పాటు.. ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది. ఈ పిటిషన్ ను కొట్టివేయాలని జయప్రద గతంలో దాఖలు చేసిన మూడు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.
భారత సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు జయప్రద. 1976లో విడుదలైన భూమి కోసం అనే సినిమా ద్వారా చిత్రసీమకు పరిచయం అయ్యారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ సినిమాల్లో నటించారు. దాదాపు 300కు పైగా చిత్రాలు చేశారు. 1994లో రాజకీయాలవైపు అడుగులు వేశారు. ముందుగా టీడీపీలో చేరారు. ఆపార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా చేశారు. 1996లో రాజ్యసబకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత టీడీపీని వీడి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి 2004లో లోక్ సభకు ఎన్నికయ్యారు.