ఎట్టకేలకు బీజేపీ మహాధర్నాకు ముహూర్తం కుదిరింది. బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి (Kishan Reddy) ని నియమించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి ధర్నాలకు ప్లాన్ చేసింది అధిష్టానం. ఈ క్రమంలోనే మహాధర్నాకు ప్లాన్ చేయగా.. పలు కారణాలతో అది వాయిదా పడింది. తాజాగా డేట్ (Date) ఫిక్స్ చేస్తూ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. కార్యక్రమం వివరాలను తెలిపారు.
ఛలో ఇందిరాపార్క్ (Indira Park) అంటూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణలోని పేద ప్రజలకు ఇస్తామన్న డబుల్ బెడ్రూం ఇళ్ల హామీని అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపటానికి చేపడుతున్న మహా ధర్నా చేస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో శనివారం ఉదయం 9.30 గంటలకు ఇది ప్రారంభం అవుతుందని వివరించారు.
తొలుత గత నెల 14న.. 20వ తేదీన ధర్నాకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది బీజేపీ. కానీ, పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ హైకోర్టు (High Court) లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం అత్యవసర విచారణ జరిపింది. ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయని.. వెయ్యి మంది ధర్నాలో పాల్గొంటే ట్రాఫిక్, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. అధికార పార్టీ కూడా ధర్నాలు చేసిన సందర్భాలున్నాయని.. అలాంటప్పుడు అభ్యంతరాలు ఎందుకని హైకోర్టు వ్యాఖ్యానించింది. ధర్నాలో 500 మందికి మించి పాల్గొనకుండా పోలీసులకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని బీజేపీకి తెలిపింది.
హైకోర్టు నుంచి లైన్ క్లియర్ కావడంతో గత నెల 25న మహాధర్నా నిర్వహించాలని బీజేపీ భావించింది. కానీ, భారీ వర్షాల కారణంగా వాయిదా వేసింది. ఆ తర్వాత జరపాలని చూసినా.. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో మరోసారి వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా 12వ తేదీని ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.