తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు అమర్ రాజా (Amar Raja) కంపెనీ ముందుకు వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించి గిగా ప్రాజెక్టును కొల్పేందుకు రెడీ అయింది. తాజాగా తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని అమర్ రాజా సంస్థ ఛైర్మన్ గల్లా జయదేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
అమర్ రాజా కంపెనీకి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో అమర్ రాజా పాత్ర చాలా కీలకమని తెలిపారు. బ్యాటరీల ఉత్పత్తిలో అధునాతన సాంకేతికతను ఉపయోగించే కంపెనీలకు ప్రోత్సాహం అందిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.
శుద్ధ ఇంధనం ఉత్పత్తికి తెలంగాణ కట్టుబడి ఉందన్నారు. అనంతరం అమర్ రాజా చైర్మన్ గల్లా జయదేవ్ మాట్లాడుతూ…. తెలంగాణలో తమ వ్యాపారాలను మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు. విద్యుత్ బ్యాటరీల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునిస్తోందని వెల్లడించారు. గిగా కారిడార్ ప్రాజెక్టుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయమని కొనియాడారు.
మరోవైపు తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా అదానీ గ్రూపు ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి సభ్యులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టే విషయంపై ఈ సందర్బంగా సీఎంతో చర్చించినట్టు సమాచారం.