ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) నేతలు.. అభివృద్థిలో తెలంగాణ (Telangana) శరవేగంతో దూసుకుపోతుందని ప్రచారాలు చేసుకుంటున్నారు. మరోవైపు తాము ఇస్తున్న సంక్షేమ పథకాలను పేదల పాలిట వరాలుగా వర్ణిస్తున్నారు. ఇంతవరకి బాగానే ఉన్నా.. నిజంగా తెలంగాణలో పేదల బతుకుల వెలుగు బీఆర్ఎస్ అయితే.. మరి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న ఆ పార్టీ నేతలకి నిరసన సెగలు ఎందుకు తాకుతున్నట్టు? అనే పిచ్చి ప్రశ్న సామాన్యుడి మెదడును తొలిచేస్తుందని అనుకుంటున్నారు.
ఇప్పటికే పలు నియోజక వర్గాలలో ఓటర్ల నుంచి చెడు అనుభవాన్ని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేతలు.. అలాంటి ఘటనలు కామన్ అంటూ.. చూరకత్తుల్లాంటి మాటలతో ప్రచారంలో పాల్గొంటున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇకపోతే మరో బీఆర్ఎస్ నేతకు ఎన్నికల ప్రచారంలో చెడు అనుభవం ఎదురైంది.. ఆదిలాబాద్ నియోజకవర్గం (Adilabad Constituency) ఎమ్మెల్యే (MLA) జోగు రామన్న (Jogu Ramanna)ఎన్నికల ప్రచారంలో భాగంగా గత వారం రోజులుగా పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయా గ్రామాల్లోని ప్రజలు తమకు సంక్షేమ పథకాలు అందలేదని నిలదీస్తుండటంతో.. రామన్న ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో జైనథ్ మండలం, పార్టీ గ్రామంలో ప్రచారానికి వెళ్లిన జోగురామన్నను ప్రచారం చేయకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే తమ గ్రామానికి రావాలంటూ నిరసన తెలిపారు. ప్రచారంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రచారాన్ని రద్దు చేసుకుని వచ్చిన దారినే జోగు రామన్న వెళ్లిపోయారు.