చంద్రయాన్-3 సక్సెస్ అయిన తర్వాత ఇస్రో (ISRO) సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు ఆదిత్య ఎల్1 ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే.. కాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి కీలక విషయం వెల్లడించారు శాస్త్రవేత్తలు.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 ప్రయోగం తుది దశకు చేరుకుందని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. ఈ వ్యోమనౌకను ఎల్1 పాయింట్‌లో ప్రవేశపెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు వచ్చే ఏడాది జనవరి 7 నాటికి పూర్తవుతాయని వెల్లడించారు.
భారత్ నుంచి మొదటిసారిగా రాకెట్ ప్రయోగాన్ని చేపట్టి 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ స్పెస్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సోమనాథ్ (Somanath) పలు విషయాలు వెల్లడించారు. సూర్యుడిపై అధ్యయనం నిర్వహించేందుకు చేపట్టిన ఆదిత్య ఎల్-1 సరైన మార్గంలో ప్రయాణిస్తోందని, సాఫీగా చివరి దశకు చేరుకుంటుందని భావిస్తున్నామన్నారు సోమనాథ్.
మరోవైపు ఆదిత్య ఎల్-1ని ఇస్రో శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సెప్టెబర్ 2న విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. చంద్రయాన్-3 (Chandrayaan-3) సక్సెస్ తర్వాత సెప్టెంబర్ 2న ఇస్రో ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని చేపట్టింది. పీఎస్‌ఎల్‌వీసీ-57 వాహననౌక ద్వారా ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టారు. సౌర వాతవరణంలో లోతుగా అధ్యయనం చేయడమే ఈ ఆదిత్య ఎల్1 లక్ష్యం. ఇక ఇండియా తరఫున సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే.