తెలంగాణ (Telangana) ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే (Dharmapuri MLA) అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) ఘోర ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. సోమవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఎమ్మెల్యేతో పాటు మరికొందరికి గాయాలయ్యాయని సమాచారం. ఈ ప్రమాదం జగిత్యాల జిల్లా ఎండవల్లి మండలం అంబారిపేట దగ్గర జరిగినట్లు సమాచారం.
ఈమేరకు ఎమ్మెల్యే లక్ష్మణ్ తో సహా.. గాయాలైన వారందరినీ కరీంనగర్ (Karimnagar)లో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో విప్ అడ్లూరి వాహనం బోల్తాపడినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఎమ్మెల్యే లక్ష్మణ్ వాహనం బోల్తా పడిందన్న సమాచారం అందుకొన్న కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు.
ధర్మపురి నేతలు సైతం ఎమ్మెల్యేను పరామర్శించేందుకు ఆసుపత్రికి చేరుకొంటున్నారు. ఇదిలా ఉండగా నిన్నహైదరాబాద్ లో పని ముగించకొని తన నియోజకవర్గానికి బయలుదేరిన క్రమంలో.. వేగంగా వెళ్తున్న లారీని తప్పించబోయి కారు అదుపు తప్పి బోల్తా పడింది. అర్ధరాత్రి 3.15 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా కారులో ఉన్న ఎయిర్‌బ్యాగ్ వెంటనే తెరుచుకోవడంతో ఎమ్మెల్యేతో పాటు మరికొందరి ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం.
మరోవైపు ఆరు రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ నెల 13న నల్గొండలో కేసీఆర్ నిర్వహించని సభకు హాజరైన ఆమె.. తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. సభ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఆమె కారు ఆటోను ఢీకొట్టింది. కారు ముందుభాగం కుడివైపు బాగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత తలకు గాయమైంది.