ఆఫ్ఘనిస్థాన్(Afganistan) రాజధాని కాబూల్(Kabool) భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. కాబూల్‌లోని పశ్చిమ ప్రాంతంలోని దష్ట్-ఎ-బర్చి ప్రాంతంలో బస్సులో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో 14మందికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు ఘటనపై కాబూల్ పోలీసు అధికార ప్రతినిధి వివరాలు వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించి తాలిబన్ యంత్రాంగం స్పందించలేదు. ప్రమాదం జరిగిన సమయంలో రద్దీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. గత వారం తాలిబాన్ రక్షణ మంత్రి మహ్మద్ యాకోబ్ ముజాహిద్ మీడియాతో మాట్లాడుతూ.. ఐఎస్-సంబంధిత దాడుల్లో 90శాతం క్షీణత ఉందని తెలిపారు.
2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి మిత్రదేశమైన తాలిబాన్‌కు ఐఎస్ కీలక ప్రత్యర్థి. మరోవైపు హిజాబ్ సరిగ్గా ధరించనందుకు కాబూల్‌లో చాలా మంది మహిళలను తాలిబాన్లు అరెస్టు చేశారు. ఈ విషయంపై ప్రవర్తనా మంత్రిత్వ శాఖ ప్రతినిధి గురువారం సమాచారం ఇచ్చారు. అయితే, ఈ కేసులో ఎంత మంది మహిళలను అరెస్టు చేశారన్న విషయాన్ని ప్రవర్తనా మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ గఫార్ ఫరూక్ వెల్లడించలేదు.
హిజాబ్ సరిగ్గా ధరించకపోవడం అంటే ఏమిటో కూడా మంత్రిత్వశాఖ వివరించలేదు. రెండు సంవత్సరాల క్రితం మే 2, 2022న తాలిబాన్ ప్రభుత్వం మహిళలు తల నుంచి కాళ్ల వరకు బురఖా ధరించాలని.. తమ కళ్ళు మాత్రమే చూపించాలని నిబంధనను జారీ చేసిన విషయం తెలిసిందే.