అప్ఘనిస్తాన్ (Afghanistan) లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. పశ్చిమ అప్ఘనిస్తాన్ లోని హేరట్ (Herat) ప్రాంతంలో భూకంపం విధ్వంసం సృష్టించింది. ఈ భూకంపంలో మొత్తం 320 మంది మృతి చెందారు. వేలాది మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టార్ స్కేలు (Rictor Scale )పై 6.3 గా నమోదైనట్టు ఐరాస తెలిపింది.
భూకంపం నేపథ్యంలో నగరంలోని పలు భవనాలు నేల మట్టం అయ్యాయి. జిందా జాన్, గోరే యాన్ లోని 12 జిల్లాల్లో భూకంపం బీభత్సం సృష్టించిందని అధికారులు తెలిపారు. హేరట్ కు వాయవ్యంగా 40 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు తెలిపారు. అప్ఘనిస్తాన్లో గడిచిన 24 గంటల్లో ఆరు భూకంపాలు సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS)వెల్లడించింది.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రతలు 5.5, 4.7, 6.3, 5.9, 4.9గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. తాజాగా పశ్చిమ అప్ఘనిస్తాన్ లో మరో భూకంపం సంభవించినట్టు తెలిపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9 గా నమోదైనట్టు యూఎస్జీఎస్ వెల్లడించింది. ఫరాస్, బద్గీస్ ప్రాంతంలో భూకంప ప్రభావం కనిపించిందని స్థానికులు వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్ లో తరుచుగా భూకంపాలు సంభవిస్తూ వుంటాయి.
ముఖ్యంగా హిందూ కుష్ పర్వత శ్రేణులు, యురేషియన్ ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల సముదాయానికి సమీపంలో ఉండటంతో ఇక్కడ ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతకు ముందు గతేడాది జూన్లో తూర్పు అప్ఘనిస్తాన్ లోని పర్వత ప్రాంతంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 2 వేల మందికి పైగా గాయపడ్డారు.