Telugu News » 23 ఏళ్ల జైలుశిక్ష.. బయటకొచ్చి ఏం చేశాడో తెలుసా?

23 ఏళ్ల జైలుశిక్ష.. బయటకొచ్చి ఏం చేశాడో తెలుసా?

by sai krishna

పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదట..భారత న్యాయదేవత,శిక్షాస్మృతి గర్వించతగ్గ సంఘటన జరిగింది. యావజ్జీవ జైలు శిక్ష అనుభవించిన గజదొంగలో మార్పు వచ్చింది.

 

కొన్నేళ్ల కిందట కొన్ని ఊళ్లకి ఊపిరాడకుండా చేసిన మృగం మనిషిగా మారాడు, సంవత్సరాల పాటు పోలీసు వర్గాలకు పుండులా సలిపిన దోపిడీదొంగ మంచివైపు మళ్లాడు. నేరాలకు దూరంగా ఉండాలని యువతరానికి సందేశమిస్తున్నాడు.

జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ వాళ్లకో చేదు అనుభవాల సారాంశంగా మారాడు. తన నేరజీవితానికి పరిహారంగా దేవాలయానికి ఓ గంటను బహూకరించాడు.

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నజ్జూ అలియాస్ రజ్జూ కరుడుగట్టిన దోపిడీ దొంగ. షాజహాన్‌పూర్, పరిసర ప్రాంతాల్లో సుమారు 12 ఏండ్లపాటు అందరినీ గడగడలాడించాడు.

పలు దోపిడీలు, హత్యలకు పాల్పడ్డాడు. 1999లో ముగ్గురు ఎస్‌ఐలు, ఒక పోలీస్‌ని కాల్చి చంపాడు.జిల్లాలో అతడిపై 15 కేసులు నమోదయ్యాయి. పోలీసులను కాల్చి చంపడంతో నజ్జూపై ఒత్తిడి పెరిగింది.

దీంతో 1999లో పోలీసులకు లొంగిపోయాడు. హత్య కేసులపై విచారణ జరిపిన కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో నాటి నుంచి బరేలి సెంట్రల్‌ జైల్లో ఉన్నాడు.

కాగా, 23 ఏండ్ల పాటు శిక్ష అనుభవించిన 58 ఏండ్ల నజ్జూ వారం కిందట జైలు నుంచి విడుదలయ్యాడు. సోమవారం బీజేపీ ఎమ్మెల్యే వీర్ విక్రమ్ సింగ్‌తో కలిసి పరౌర్‌లోని ఒక ఆలయాన్ని దర్శించాడు. అలాగే101 కిలోల బరువైన గంటను ఆ గుడికి విరాళంగా ఇచ్చాడు.

ఈ సందర్భంగా చేసిన నేరాల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. నేరాలకు దూరంగా ఉండాలని, భవిష్యత్తు, కుటుంబంపై దృష్టిసారించాలని యువతకు సూచించాడు.మరోవైపు నజ్జూను జనజీవన స్రవంతిలోకి స్వాగతిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే వీర్ విక్రమ్ సింగ్‌ తెలిపారు.చేసిన నేరాలకుగాను 23 ఏండ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడని చెప్పారు.

అలాగే ఎవరైనా నేర జీవితాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని భావిస్తే వారికి తాను సహాయం చేస్తానని అన్నారు. కాగా, షాజహాన్‌పూర్, బరేలీ, ఫరూఖాబాద్, బుదౌన్, ఎటా, హర్దోయ్ జిల్లాల్లో నజ్జూ ముఠా ప్రభావం ఎక్కువగా ఉన్నదని పోలీసులు తెలిపారు.

You may also like

Leave a Comment