మధుర శ్రీ కృష్ణ జన్మభూమి (shri krishna janmabhoomi) వివాదంలో షాహిద్ ఈద్గా మసీద్‌లో సర్వేకు ఇటీవల న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలో తాజాగా యూపీలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆగ్రాలోని షాహీ జామా మసీదు (Shahi Jama Masjid)లో సర్వే చేపట్టాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగ్రాలోని మసీదు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అఖిల భారతీయ హిందూ మహాసభకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున షాహీ జామా మసీదు వద్దకు చేరుకున్నారని పోలీసులు వెల్లడించారు. అనంతరం మసీదు వద్ద మిఠాయిలు పంచి పెట్టారని అన్నారు. అలాంటి కార్యక్రమాలు చేయవద్దని పోలీసులు వారించినా హిందూ సంఘాల నాయకులు వినలేదన్నారు. దీంతో మసీదు సమీపంలో భారీగా పోలీసులను మోహరించామని తెలిపారు.
మరోవైపు హిందూ మహాసభ జాతీయ ప్రతినిధి సంజయ్ జాట్ మాట్లాడుతూ… ఆగ్రాలో షాహీ జామా మసీదులో సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. మధురాలోని కేశవ దేవ్ ఆలయంలోని విగ్రహాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తీసుకు వెళ్లి షాహీ జామా మసీదులోని మెట్ల కింద పాతి పెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకునే పరిస్థితి నెలకొంది.
మత పెద్దల సహకారంతో ఘర్షణ జరగకుండా పరిస్థితిని సద్దుమణిగేలా పోలీసులు చేశారు. భారతీయ ముస్లిం వికాస్ పరిషత్ చైర్మన్, సమీ అఘై మాట్లాడుతూ…. అలహాబాద్ హైకోర్టులో జరిగిన న్యాయ పోరాటంలో ముస్లింలు ఓడిపోయారన్నారు. అయినప్పటికీ భారతదేశ న్యాయ వ్యవస్థ, నిష్పాక్షికతపై తమ విశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదని వెల్లడించారు.