తెలంగాణలో బ్యారేజీల్లో లీకింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. మొన్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారెజ్ (Lakshmi Barrage) పిల్లర్ల ఘటన మరచి పోకముందే తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అన్నారం సరస్వతి బ్యారేజి (Saraswathi Barrage) లో 28,38 నంబర్ గల రెండు గేట్ల వద్ద నీరు పైకి ఉబికి వస్తోంది.
ఈ క్రమంలో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఇలా వుంటే సంచులతో నీటి ఊటలను ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బ్యారేజీ నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం బ్యారేజీలో 5.71 టీఎంసీల నీటిమట్టం ఉంది. ప్రస్తుతం బ్యారేజీ గేటును ఎత్తి 2,357 టీఎంసీల నీటిని కిందకు వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటీవల మేడిగడ్డ లక్ష్మీ బ్యారెజ్ లో పిల్లర్లు కుంగి పోయాయి. పిల్లర్ నెంబర్ 15 నుంచి 20 వరకు కుంగి పోయాయి. ఈ నేపథ్యంలో వెంటనే మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య బ్యారేజీ పైనుంచి రాకపోకలు అధికారులు నిలిపి వేశారు. బ్యారేజీ వద్దకు వెళ్లేందుకు ఎవరినీ పోలీసులు అనుమతించలేదు.
పిల్లర్లు కుంగి పోయిన ఘటనపై బీఆర్ఎస్ సర్కార్ ను ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. ప్రాజెక్టు నాణ్యత విషయంలో సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించాయి. మరోవైపు ఇటు బ్యారేజిని పరిశీలించేందుకు కేంద్రం నుంచి నిపుణుల బృందం కూడా రాష్ట్రానికి వచ్చింది. తాజాగా అన్నారం బ్యారేజీ ఘటన వెలుగులోకి రావడంతో ప్రాజెక్టు నాణ్యతపై విపక్షాలు మరోసారి అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.