– మునుగోడు కాంగ్రెస్ లో గందరగోళం
– పార్టీకి పాల్వాయి స్రవంతి రాజీనామా
– రాజగోపాల్ రెడ్డి రాకతో మారిన సీన్
– టికెట్ దక్కకపోవడంతో అలక
– బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రచారం
ఓవైపు చేరికలతో హడావుడిగా ఉన్న కాంగ్రెస్ (Congress) క్యాంప్ లో భారీ కుదుపు చోటు చేసుకుంది. మునుగోడు కీలక నేత పాల్వాయి స్రవంతి (Palvai Sravanthi) పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా అవమానించింది చాలదన్నట్టు.. తనకు పార్టీలో గుర్తింపు ఇవ్వడం లేదని ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధిష్టానానికి లేఖ పంపించారు.
బీఆర్ఎస్ లో చేరిక
కాంగ్రెస్ లో జరిగిన అవమానాన్ని బీఆర్ఎస్ (BRS) లో చేరి మర్చిపోవాలని చూస్తున్నారు పాల్వాయి స్రవంతి. నేడో రేపో మంత్రి కేటీఆర్ (KTR) సమక్షంలో గులాబీ గూటికి చేరనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) వెనక్కి వచ్చినప్పటి నుంచి స్రవంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే గులాబీ గూటికి చేరాలని డిసైడ్ అయ్యారు.
రాజగోపాల్ రాకతో అయోమయం
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ కు కీలక నేతగా ఉన్నారు పాల్వాయి స్రవంతి. అంతకుముందు వరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్రీయాశీలకంగా వ్యవహరించారు. ఆయన బీజేపీ గూటికి వెళ్లడంతో ఉప ఎన్నికలో స్రవంతి పోటీ చేశారు. అప్పట్లో మూడో స్థానంలో నిలిచారు. అయితే.. ఈమధ్య బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు టికెట్ ఇచ్చి మరీ వెల్ కమ్ చెప్పింది అధిష్టానం. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు పాల్వాయి స్రవంతి. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు తన లాంటి వారు నియోజకవర్గంలో పార్టీకి అండగా ఉన్నామని, అలాంటిది తమనే విస్మరిస్తే ఎలా అని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
ఆ అనుమానాలే నిజమయ్యాయి!
మునుగోడు అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పేరు ప్రకటించిన రోజునే పార్టీకి స్రవంతి రాజీనామా చేస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ, దీన్ని ఆమె ఖండించారు. తాను బీఆర్ఎస్ లో చేరడం లేదని స్పష్టం చేశారు. గత ఉప ఎన్నిక సమయంలో కూడా ఇలాంటి వార్తలు ప్రచారం అయ్యాయని గుర్తు చేశారు. తాను మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, మునుగోడు మండలాల్లో పర్యటించి పార్టీ కార్యకర్తల్ని కలిసి వారి అభిప్రాయాలు సేకరిస్తున్నానని చెప్పారు. తదుపరి కార్యాచరణ కోసం నిర్ణయం తీసుకుంటున్న వేళ ఇలాంటి వార్తలు రావడం తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా ఓ వీడియో విడుదల చేశారు. కానీ, చివరకు పార్టీ మార్పు అనుమానాలే నిజమయ్యాయి.