కేంద్ర ప్రభుత్వం(Central Government) తీసుకొచ్చిన అగ్నివీర్ పథకం(Agnipath scheme)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) విమర్శలు గుప్పించారు. గుండె ధైర్యాన్ని అవమానించేందుకే ఈ పథకాన్ని రూపొందించారని ఆయన విమర్శించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరుల కోసం ఈ పథకంలో ఎలాంటి ప్రయోజనాలను లేవని ఆరోపించారు.
సైనికుల కోసం ఇచ్చే పింఛన్, ఇతర ప్రయోజనాలు ఎన్‌డీఏ ప్రభుత్వం తొలగించిందని తెలిపారు. సియాచిన్‌లో ఇటీవల మృతిచెందిన అగ్నివీర్ అక్షయ్ లక్ష్మణ్ మృతిపట్ల రాహుల్‌గాంధీ విచారం వ్యక్తం చేశారు. ‘దేశం కోసం ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆయన సేవలకు గ్రాట్యుటీ, ఇతర మిలిటరీ సదుపాయాలు ఏవీ లేవు. ఆ కుటుంబానికి పింఛన్ కూడా రావడం లేదు. లక్ష్మణ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. దేశ హీరోలను అవమానించేందుకే అగ్నివీర్ పథకాన్ని తీసుకువచ్చింది.’ అని ఎక్స్‌లో కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు సంధించారు.
కాగా రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ చేసిన ఆరోపణలన్నీ బాధ్యతారాహిత్యమైనవని కొట్టిపారేశారు. ‘తన విధి నిర్వహణలో భాగంగా అగ్నివీర్ అక్షయ్ లక్ష్మణ్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులకు ఆయన అర్హుడు. కాంట్రిబ్యుటరీ ఇన్సూరెన్స్ కింద రూ.48లక్షలు బాధిత కుటుంబానికి అందుతాయి’ అని తెలిపారు.
అంతేకాకుండా ఎక్స్‌గ్రేషియా కింద మరో రూ.44లక్షలు అందుతాయి. అదేవిధంగా ఇతర కాంట్రిబ్యూషన్ సైతం ఆయన కుటుంబం స్వీకరిస్తోంది.’ అని అమిత్ మాలవీయ చెప్పుకొచ్చారు. ప్రధాన మంత్రి పదవికి పోటీ చేసే వ్యక్తి ఇలాంటి అసత్యమైన వార్తలను వైరల్ చేయొద్దని వ్యాఖ్యానించారు. అగ్నివీర్ పథకంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.