సైనిక బలగాల నియామకం కోసం 2022 మే 31న మోదీ సర్కార్ అగ్నిపథ్ స్కీమ్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం వల్ల దేశ యువతకు తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పథకాన్ని రద్దు చేసి పాత విధానం ప్రకారం నియామకాలు చేపడతామని హామీ ఇచ్చింది.
ఈ మేరకు అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ స్కీమ్ వల్ల 2లక్షల మంది యువతకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. వారికి న్యాయం చేయాలని కోరిన ఖర్గే- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ విధానానికి స్వస్తి పలుకుతామని స్పష్టం చేశారు.
అగ్నిపథ్ పథకంతో అనేక సమస్యలు ఉన్నాయన్న ఖర్గే దీని వల్ల ఒకే కేడర్‌లోని సైనికుల మధ్య వివక్ష ఏర్పడుతుందన్నారు. ఒకే పని చేసినప్పటికీ వేతన భత్యాలు మాత్రం వేరుగా ఉంటాయన్నారు. 2019-2022 మధ్య 2 లక్షల మంది యువత త్రివిధ దళాల్లో చేరగా అగ్నిపథ్ స్కీమ్‌తో వారి ఆశలన్నీ ఆవిరయ్యాయంటూ ఖర్గే పేర్కొన్నారు.
సైన్యం చేరాలని ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డ యువతలో నిరాశ పెరుగుతోందని, కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ లేఖను మల్లికార్జున ఖర్గే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఈ లేఖను షేర్ చేశారు. మోదీ గ్యారంటీ అంటే ఇదేనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మరోవైపు, ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ ఇదే అంశంపై మాట్లాడారు. ప్రభుత్వానికి కొంత డబ్బు ఆదా అవ్వడం తప్పితే దీర్ఘకాలంలో ఈ పథకం వల్ల లాభం లేదన్నారు. ‘పాత నియామక విధానానికి వెళ్లడమే ఉత్తమమని కాంగ్రెస్ భావిస్తోందని చెప్పారు. ఆగమేఘాల మీద భవిష్యత్‌లో ఆర్మీ పనితీరు ఎలా ఉంటుందనే విషయాన్ని పెద్దగా ఆలోచించకుండా ఈ స్కీమ్ తీసుకొచ్చారని సచిన్ పైలట్ విమర్శించారు.