అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF)చీఫ్ క్రిస్టలీనా జార్జియేవా (Kristalina Georgieva) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు కృత్రిమ మేధతో ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలపై ఏఐ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా ఉత్పాదకతను పెంచి ప్రపంచ అభివృద్ధికి కూడా ఏఐ తోడ్పడే అవకాశం ఉందని వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఏఐ ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపారు. స్విట్జర్లాండ్ లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సుకు బయలు దేరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ….
అభివృద్ధి చెందిన దేశాల్లో 60 శాతం ఉద్యోగాలపై ఏఐతో ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. నైపుణ్య ఆధారిత ఉద్యోగాలు అధికంగా ఉన్న రంగాలపై సాంకేతిక ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు అమలు చేసిన దవ్ర్య విధానాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు.
ప్రస్తుతం ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోందని అన్నారు. ఇది ఇలా వుంటే ఏఐ ప్రభావంతో కేవలం సగం శాతం ఉద్యోగాలు మాత్రమే ప్రతికూలంగా ప్రభావితం అవుతాయని ఐఎంఎఫ్ నివేదిక వెల్లడించింది. మిగిలిన ఉద్యోగాలు వాస్తవానికి ఏఐ కారణంగా అధిక ఉత్పాదకత లాభాల నుండి ప్రయోజనం పొందవచ్చని తెలిపింది. ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పడుతోందని చెప్పింది.