రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(DRDO) అద్భుత విజయం సాధించింది. 25 కిలో మీటర్ల పరిధిలో దూసుకొస్తున్న 4 లక్ష్యాలను ఢీ కొట్టే సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి దేశంగా భారత్ అవతరించిందని తెలిపింది. ఈ మేరకు డీఆర్డీవో రూపొందించిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ సరికొత్త అంచనాలను అందుకుంది.
ఒకే ఫైరింగ్ యూనిట్ ద్వారా ప్రయోగించిన నాలుగు క్షిపణులు 25 కిలోమీటర్ల పరిధిలో దూసుకొస్తున్న నాలుగు లక్ష్యాలను ఏకకాలంలో ఢీకొట్టేలా అభివృద్ధి చేశారు. ఈ నూతన వ్యవస్థ విజయవంతమైనట్లు డీఆర్డీవో తెలిపింది. ఈ సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి దేశంగా భారత్ నిలిచిందని x(ట్విట్టర్) వేదికగా పంచుకుంది.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్ క్షిపణులను భారత్ సుమారు పదేళ్లుగా సాయుధ దళాల్లో వినియోగిస్తోంది. డిసెంబర్ 12న ఏపీలోని బాపట్ల జిల్లా సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో అస్త్రశక్తి-2023 విన్యాసాలను వాయుసేన నిర్వహించింది. ఈ సందర్భంగా నింగి నుంచి దూసుకొచ్చిన నాలుగు లక్ష్యాలను ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ఏకకాలంలో ధ్వంసం చేసింది. గగనతలానికి దూసుకెళ్లే ఈ క్షిపణిని షార్ట్ రేంజ్ లక్ష్యాలను ఛేదించేందుకు అభివృద్ధి చేశారు.
‘సింగిల్ ఫైరింగ్ యూనిట్‌ను ఉపయోగించి కమాండ్ గైడెన్స్ ద్వారా ఏకకాలంలో 25 కిలో మీటర్ల పరిధిలో దూసుకొస్తున్న నాలుగు లక్ష్యాలను ఛేదించాం. ఈ సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి దేశంగా భారత్ అవతరించింది. దేశీయంగా రూపొందించిన ఆకాశ్ వెపన్ సిస్టమ్ ద్వారా ఈ ప్రయోగం చేపట్టి విజయం సాధించాం..’ అని డీఆర్డీఓ పేర్కొంది.
మరోవైపు క్షిపణి వ్యవస్థలతో పాటు మానవ రహిత విమానాలపై పరిశోధనలను డీఆర్డీవో ముమ్మరం చేసింది. డీఆర్డీఓ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన హైస్పీడ్ ఫ్లయింగ్ వింగ్ మానవరహిత విమానాన్ని(యూఏవీ) విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ శుక్రవారం తెలిపింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ పరీక్ష జరిగింది. ఈ తరహా సంక్లిష్ట పరిజ్ఞానం కలిగిన అతికొద్ది దేశాల సరసన ఇండియా చేరింది.