– అసెంబ్లీ ముందుకు విద్యుత్ రంగ శ్వేతపత్రం
– అప్పులు రూ.81,516 కోట్లు
– చర్చ సందర్భంగా రేవంత్ వర్సెస్ అక్బర్
– పాతబస్తీలో బిల్లుల ఎగవేతపై చర్చ
– ముస్లింల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారన్న అక్బర్
– మీరొక్కరే ముస్లిం నాయకుడు కాదంటూ రేవంత్ కౌంటర్
– ముస్లింలకు కాంగ్రెస్ ఎంతో చేసిందని వివరణ
– రేవంత్ పార్టీ మార్పుపై అక్బురుద్దీన్ విమర్శలు
– మీ లిస్ట్ చెప్పమంటారా? అంటూ సీఎం కౌంటర్లు
– చర్చ సందర్భంగా అక్బర్ అరెస్ట్ పైనా ప్రస్తావన
హైదరాబాద్ (Hyderabad).. విశ్వ నగరంగా మారుతోందని పాలకులు చెబుతున్నారు. కానీ, ఈ మహా నగరంలోని పాతబస్తీ విద్యుత్ బకాయిలు, చోరీలకు అడ్డాగా మారిందని మొదట్నుంచి విమర్శలు ఉన్నాయి. తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ (Telangana) అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ విషయాన్ని ప్రకటించారు. విద్యుత్ బిల్లుల ఎగవేతలో సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ అగ్రస్థానాల్లో ఉన్నాయని అన్నారు. విద్యుత్ రంగంపై శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ (Akbaruddin) మధ్య నువ్వా నేనా అన్నట్టు వాడీవేడీగా వార్ కొనసాగింది.
పాతబస్తీ బకాయిలపై అధికారుల లెక్కలేంటి?
విద్యుత్ సంస్థలు విడుదల చేసిన లెక్కల ప్రకారం.. హైదరాబాద్ సౌత్ జోన్ పరిధిలోకి వచ్చే పాతబస్తీలోని అస్మాన్ ఘర్, చార్మినార్, బేగంబజార్ ప్రాంతాల్లో విద్యుత్ ఫీడర్లు ఉన్నాయి. ఈ ప్రాంత పరిధిలో అత్యధిక విద్యుత్ చౌర్యం జరుగుతున్నట్లు డిస్కంలు, విద్యుత్ సంస్థలు గతంలో నివేదిక విడుదల చేశాయి. అస్మాన్ ఘర్ ఏరియాలో 39 శాతం, బేగంబజార్ ఏరియాలో 35 శాతం, చార్మినార్ ఏరియాలో 38 శాతం విద్యుత్ చోరీ జరుగుతోంది. సరాసరిగా వందకు 37 శాతం విద్యుత్ చోరీ అవుతోంది. దీని విలువ ఏడాదికి రూ.700 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.6,500 కోట్లకు పైగా విద్యుత్ చోరీ అయింది.
మొదట్నుంచి బుకాయిస్తున్న అక్బరుద్దీన్
తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో వివిధ చార్జీల పేరుతో ముక్కుపిండి విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్న అధికారులు.. ఒకనెల బకాయి ఉన్నా కనెక్షన్ కట్ చేస్తారు. పాతబస్తీలో మాత్రం ఏళ్ల తరబడి విద్యుత్ చౌర్యం జరుగుతున్నా, వేల కోట్ల విద్యుత్ వృధా అవుతున్నా అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాత్రం దీన్ని తప్పుబడుతున్నారు. పాతబస్తీ వాసులను బద్నాం చేస్తున్నారని అసెంబ్లీలో పలుమార్లు పేర్కొన్నారు. అయితే.. అధికారిక లెక్కలు ఉన్నా, పాత బస్తీలో విద్యుత్ చౌర్యం జరుగడం లేదని దబాయించడం ఆయనకే చెల్లింది. అంతేకాదు బకాయిలు ఉంటే నిరూపించాలని, తానే కడతానని ప్రభుత్వానికి సవాల్ కూడా చేశారు.
విద్యుత్ రంగ శ్వేతపత్రంతో మరోసారి చర్చ
విద్యుత్ రంగంపై గురువారం జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. కాంగ్రెస్ ముస్లింల గొంతునొక్కే ప్రయత్నం చేస్తోందని అక్బరుద్దీన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై సీఎం సీరియస్ అయ్యారు. అక్బరుద్దీన్ మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యే మాత్రమేనని.. ఆయన ముస్లింలందరికీ నాయకుడు కాదన్నారు. అక్బురుద్దీన్ ను తాము ముస్లిం ప్రతినిధిగా చూడట్లేదని స్పష్టం చేశారు. చాంద్రాయణగుట్టలో హిందువులు కూడా ఓటు వేస్తేనే ఆయన గెలిచారన్నారు. అంతకు ముందు అక్బరుద్దీన్ మాట్లాడుతూ తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దానిని నెరవేర్చాలన్నారు.
కవ్వంపల్లిపై అక్బర్ అనుచిత వ్యాఖ్యలు
పాతబస్తీలో విద్యుత్ సమస్యలపై ప్రస్తావించిన అక్బర్.. వాటిని పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కలుగజేసుకుని తన ప్రాంతంలో ఉన్న విద్యుత్ సమస్యలపై అక్బరుద్దీన్ ఒవైసీ గత ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. దీంతో కవ్వంపల్లి వ్యాఖ్యలకు అక్బరుద్దీన్ స్పందిస్తూ ఆయన ఓ బచ్చా అని వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందన్నారు. దీనిపై సీఎం రేవంత్ స్పందించారు. దళిత ఎమ్మెల్యేను గౌరవించాలన్నారు. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని తమకు ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అన్న తేడా లేదని చెప్పారు. అక్బరుద్దీనే తన మిత్రుడు కేసీఆర్ ను కాపాడేందుకు పదే పదే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో ఎంఐఎం కూడా భాగస్వామ్యంగా ఉందని, ఆ ప్రభుత్వంలో తప్పులకు ఈ పార్టీకి కూడా బాధ్యత ఉంటుందన్నారు. విద్యుత్ బకాయిలలో గజ్వేల్, సిద్ధిపేట, హైదరాబాద్ సౌత్ ప్రాంతాలు అగ్రస్థానంలో ఉన్నాయని ఈ ప్రాంతాలలో ఆ బకాయిలు రాబట్టి విద్యుత్ సంస్థలను నష్టాల ఊబినుంచి పైకి తెచ్చేందుకు అక్బరుద్దీన్ సహకరించాలన్నారు. అంతే తప్ప బీఆర్ఎస్ ను ఎంఐఎం పొగడ్తలతో ముంచెత్తుతుంటే కూర్చొని వినడానికి తాము సిద్ధంగా లేమని కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు వెల్ లోకి దూసుకువచ్చి నిరసన వ్యక్తం చేశారు.
అక్బరుద్దీన్ అరెస్ట్ ప్రస్తావన
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ తీవ్రంగా స్పందించారు. తాము ఎవరికీ భయపడబోమని.. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదన్నారు. కాంగ్రెస్ తమను అణచివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాతబస్తీలో విద్యుత్ చౌర్యం అంటున్నారా? విద్యుత్ బకాయిలు అంటున్నారా? అనేది క్లారిటీ ఇవ్వాలన్నారు. ఇక తమను ఆయా చోట్ల పోటీ చేయలేదని ఆయన ప్రశ్నిస్తున్నారని, ఎక్కడ పోటీ చేయాలనేది తమ ఇష్టమని చెప్పారు. షబ్బీర్ అలీని ఓడించేందుకు ప్రయత్నించామని చెబుతున్నారని, తాము నిజామాబాద్ అర్బన్ లో పోటీయే చేయలేదన్నారు అక్బరుద్దీన్.
రేవంత్ ఆర్ఎస్ఎస్ లింక్స్ పైనా రచ్చ
సీఎం రేవంత్ రెడ్డి ఏబీవీపీ, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ అంటూ విమర్శలు గుప్పించారు అక్బరుద్దీన్. ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాను మజ్లిస్ గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడుతానన్నారు. నాదెండ్ల, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి, నిన్నటి వరకు కేసీఆర్ ఇలా అందరితో దోస్తీ చేశారని గుర్తు చేశారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో చర్చిద్దామంటే సిద్ధమని, మజ్లిస్ ఎక్కడి నుంచి వచ్చిందో చర్చిద్దాం రండి అని అన్నారు. అయితే రేవంత్ గురించి అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తప్పుబట్టారు. సభా నాయకుడిపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదని సూచించారు. మీలాగే ఇక్కడి వారందరూ గెలిచి వచ్చారని వ్యాఖ్యానించారు. ఎవరి మీద పడితే వారి మీద ఎదురు దాడి చేస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు.