అక్రమ మైనింగ్ కేసు(Illegal mining case)లో సీబీఐ విచారణకు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) డుమ్మా కొట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఐదేళ్ల కిందట నమోదైన ఈ కేసులో సాక్ష్యమిచ్చేందుకు ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని యూపీ మాజీ సీఎంకు సీబీఐ (CBI) నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.
సీఆర్పీసీ సెక్షన్ 160 కింద విచారణకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవైపు గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం ఉన్నప్పటికీ 2012-16 మధ్య కాలంలో పలు గనుల లైసెన్స్‌లను అక్రమంగా రెన్యువల్ చేశారని అఖిలేశ్ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ కొనసాగుతోంది. అఖిలేశ్ మాత్రం త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తనను వేధించడానికే బీజేపీ ఈ నోటీసులు జారీ చేయించిందని ఆరోపించారు.
2012-13లో అఖిలేశ్ యాదవ్ గనుల శాఖ మంత్రిగా స్వల్పకాలం పనిచేశారు. అప్పుడు ఈ-టెండర్ విధానాన్ని అతిక్రమించి నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ లీజులు మంజూరు చేశారని ఆరోపణలను ఎదుర్కొన్నారు.నేరపూరిత కుట్ర, దొంగతనం, దోపిడీ, మోసం వంటి నేరాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్రమ మైనింగ్‌కు అనుమతించినందుకు 11మంది గుర్తుతెలియని ప్రభుత్వోద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
అధికారుల సాయంతో అక్రమ మైనింగ్ జరుగుతోందా? లేదా? అనే నివేదిక సమర్పించాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ అఖిలేష్‌కు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఈడీ విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఎనిమిది సార్లు సమన్లు జారీ చేశారు. ఇక ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అవినీతి ఆరోపణలతో అరెస్టయ్యారు. అటు పశ్చిమ బెంగాల్ టీఎంసీ నేతలు పలు కుంభకోణాల్లో చిక్కుకున్నారు.