బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని చాందినీచౌక్ నుంచి బీజేపీ((BJP) ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగునున్నట్లు సమాచారం. బీజేపీ అగ్రనేతలు ఆయనను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్‌ల మధ్య పొత్తులు కుదిరిన విషయం తెలిసిందే.
ఢిల్లీలోని మూడు స్థానాల్లో కాంగ్రెస్, నాలుగు స్థానాల్లో ఆప్ బరిలో దిగాలని నిర్ణయించుకున్నాయి. దీంతో బీజేపీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో గతంలో గెలిచిన మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలను తిరిగి ఈసారి కూడా దక్కించుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఏడు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.
పార్లమెంటులోని సిట్టింగ్ స్థానాల్లో కొందరిని పక్కపెట్టి కొత్త వారిని నిలబెట్టాలని బీజేపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ను బరిలోకి దించాలని బీజేపీ చూస్తోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఢిల్లీలోని చాందినీ చౌక్ స్థానం నుంచి అక్షయ్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై పార్టీ నేతలు అక్షయ్‌ను ఒకసారి సంప్రదించినట్లు సమాచారం.
సినిమాల్లోకి రాకముందు అక్షయ్ కుమార్ చాలా ఏళ్లు చాందినీ చౌక్‌లోనే నివాసమున్నారు. స్థానికతను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అక్షయ్‌ను బరిలోకి దింపాలని చూస్తోందట. 2014, 2019 ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని స్థానాలను బీజేపీ స్వీప్ చేసింది. బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ 2014, 2019లో చాందినీ చౌక్ స్థానం నుంచి గెలుపొందారు. అంతకుముందు 2004, 2009లో మాజీ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మంత్రి కపిల్ సిబల్ గెలుపొందారు.