నూతన కలెక్టర్లను కేసీఆర్ (KCR) రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మార్చారని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి (Akunuri Murali) మురళి ఆరోపించారు. ఎవరు ఎక్కువ అవినీతి చేస్తే వాళ్లకు కేసీఆర్ ప్రమోషన్లు ఇచ్చి హైదరాబాద్‌లో వేశాడని ఆరోపణలు చేశారు. రాష్ట్రాన్ని అనేక విధాలుగా కేసీఆర్ దోచుకున్నాడని మండిపడ్డారు. హైదరాబాద్ బేగంపేట ది హరిత ప్లాజాలో తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రొఫెసర్ కోదండరాం, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ…. మాజీ సీఎం కేసీఆర్ పరిపాలకుడు కాదన్నారు. కేసీఆర్ పెద్ద విధ్వంసకారుడని నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాలన ముగిసిందని వదిలిపెట్టవద్దన్నారు.
ఆయన్ని ఎలా వదిలిపెడతాం..? అని అన్నారు. రెవెన్యూ, ఆర్థిక, విద్య, టీఎస్పీఎస్సీ, గ్రామ పరిపాలనతో పాటు అన్నింటినీ కేసీఆర్ ధ్వంసం చేశారని ఆరోపణలు గుప్పించారు. రాజకీయాలను కేసీఆర్ అవినీతిమయం చేశాడన్నారు. కేసీఆర్ పాలనలో అవినీతి జరగని శాఖ లేదన్నారు. ఇప్పుడు కొత్త దొంగలు రాకుండా చూసుకోవాలన్నారు.
పాత దొంగలు కొన్ని నేర్పి వెళ్లారని, వాళ్లలాంటి వారి నుంచి తెలంగాణను కాపాడుకోవాలన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ అవినీతి పరుడేనన్నారు. ఆ విషయాన్ని తాను కాదనన్నారు. ఆయన ఎప్పుడో బిహార్ వెళ్లాడన్నారు. కేసీఆర్ కు పరిపాలన అంటే చిరాకన్నారు. కనీసం 90 వేల ఫైళ్లు చూడకుండా వెనక్కి పంపేవాడన్నారు.