Telugu News » TS Politics : టార్గెట్ 80.. అభ్యర్థుల వేటలో పార్టీలు..!

TS Politics : టార్గెట్ 80.. అభ్యర్థుల వేటలో పార్టీలు..!

శ్రావణ మాసం ప్రారంభం కావడంతో రేపో మాపో లిస్టును విడుదల చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

by admin
all parties exercise for candidates

– బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రెడీ
– అతి త్వరలో ప్రకటన
– సైలెంట్ గా సర్వేలు చేయిస్తున్న కాంగ్రెస్
– రేపటి నుంచి అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ
– ఐదు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్
– ఆచితూచి అభ్యర్థుల ప్రకటన
– అందరి టార్గెట్ 80 సీట్ల పైనే!
– వ్యూహప్రతివ్యూహాల్లో బిజీబిజీ

దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. అందరి చూపు తెలంగాణ (Telangana) వైపే ఉంది. జాతీయ రాజకీయాల జపం చేస్తున్న కేసీఆర్ (KCR) కు ఈసారి గెలుపు చాలా కీలకం. ఇక్కడ గెలిస్తేనే అక్కడ సత్తా చాటగలరు. కర్ణాటక (Karnataka) ఇచ్చిన బూస్టప్ తో తెలంగాణలోనూ పాగా వేయాలనేది కాంగ్రెస్ (Congress) ప్లాన్. ఈ క్రమంలోనే సర్వేల్లో తలమునకలైంది. ఇక బీజేపీ (BJP) ఐదు రాష్ట్రాలను కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. దీనికోసం గెలుపు గుర్రాలను బరిలోకి దించాలని ఆచితూచి అడుగులు వేస్తోంది.

all parties exercise for candidates

వారం పది రోజుల నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలి జాబితా రెడీ అయిపోయిందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఓ లిస్టు కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోది. 80 మందికి పైగా అభ్యర్థులతో కూడిన జాబితాను ఒకేసారి ప్రకటించి కేసీఆర్ ప్రతిపక్షాలకు ఝలక్ ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముహూర్తాలు, వాస్తు గట్టిగా నమ్మే కేసీఆర్‌.. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో రేపో మాపో లిస్టును విడుదల చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జిల్లాల వారీగా గట్టి అభ్యర్థుల మీద ఫోకస్‌ పెట్టిన కేసీఆర్.. మార్చాల్సిన వారి గురించి కూడా పూర్తి క్లారిటీతో ఉన్నారని అంటున్నారు. ఈసారి గెలుపు చాలా కీలకం కావడంతో అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పార్టీ నేతలు 80కి పైగా స్థానాల్లో గెలుస్తామని అంటుంటే.. మంత్రి కేటీఆర్ మాత్రం మన టార్గెట్ వంద అంటూ ఆపార్టీ శ్రేణులకు హితబోధ చేస్తున్నారు.

కర్ణాటక గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్.. తెలంగాణలో పాగా వేయాలని చూస్తోంది. బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని నిర్ణయించింది. ఈనెల 25 వరకు ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసింది. వచ్చిన దరఖాస్తులను ఎన్నికల కమిటీ స్క్రీనింగ్​ నిర్వహించి అభ్యర్థుల జాబితాను రూపొందిస్తారు. వచ్చేనెల మొదటి వారంలోగా దరఖాస్తులను పరిశీలించి.. అదే నెల రెండో వారంలో 40 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్​ భావిస్తున్నట్టు సమాచారం. అయితే.. కాంగ్రెస్​ లో 70కి పైగా సెగ్మెంట్లలో టిక్కెట్ల కోసం తీవ్రమైన పోటీ ఉంది. బీఆర్ఎస్ మాదిరిగానే పలు నియోజకవర్గాల్లో ముగ్గురు, నలుగురు ఆశావాహులు టిక్కెట్ల కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ వహారం హస్తంలో ఎలాంటి అలజడి రేపుతుందోననే ఆసక్తి నెలకొంది. ఇటు సైలెంట్ గా సర్వేలు చేస్తోంది కాంగ్రెస్. ఈసారి 80కి పైగా స్థానాల్లో గెలుపు అవకాశాలున్నాయని తమ సర్వేల్లో తేలిందని ఆయా వర్గాలు అంటున్నాయి.

మరోవైపు, బీజేపీ దూకుడు మీదుంది. ఎన్నికలు జరగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లో అభ్యర్థులపై ఫోకస్ పెంచింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో తొలి జాబితాను రిలీజ్ చేసింది. ఈ ప్రకటనతో మిగతా పార్టీలు తమకంటే వెనుకున్నాయనే సంకేతాన్నిచ్చింది. త్వరలోనే మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది. అలాగే, మిగిలిన మూడు రాష్ట్రాల అభ్యర్థులపైనా కసరత్తులు చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ.. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ కు స్కోప్ లేదని.. బీఆర్ఎస్ 30 స్థానాలకు లోపే పరిమితం అవుతుందని అనుకుంటున్నారు కమలనాథులు. ఈసారి ప్రజలు కాషాయ పార్టీకి ఓటేసేందుకు నిర్ణయం తీసుకున్నారని ధీమాగా చెబుతున్నారు. మొత్తంగా ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. 80 సీట్లే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి.

You may also like

Leave a Comment