రేపు హైదరాబాద్ (Hyderabad) అంతా గణపతిబప్పా మోరియా అంటూ మారుమోగనుంది. నగరంలో ఎటువైపు చూసినా నిమజ్జనానికి వెళ్లే గణనాధులే కనిపిస్తాయి. వీధులన్నీ గణపతి (Ganesh) ఊరేగింపులతో సందడితో నిండిపోతాయి. నిమజ్జనం (Nimarjanam) హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లను పోలీసులు పూర్తి చేశారు.
నిమజ్జనం కోసం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 25,694 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. సున్నిత ప్రాంతాల్లో ఆర్ఫీఎఫ్, పారామిలిటరీ భద్రత ఉంటుంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 6 వేల మంది పోలీసులతో భద్రతకు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఆరోగ్యసమస్యలు తలెత్తే అవకాశమున్నందున ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. నిమజ్జనం రోజున అందరి దృష్టి ఖైరతాబాద్ గణేషుడిపైనే ఉంటుంది.
ఖైరతాబాద్ గణేశుడిని రేపు ఉదయం 11:30 గంటలకు నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. అందులో భాగంగా ఇవాళ బాలానగర్ నుంచి ట్రాలీ, భారీ క్రేన్ ఎన్టీఆర్ గార్డెన్ కు చేరుకుంటాయి. రాత్రి 10 గంటల నుంచి విగ్రహం తరలింపునకు ఏర్పాట్లు చేస్తారు. అర్ధరాత్రి 12 గంటలకు చివరి పూజా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఒంటిగంట తర్వాత గణపతిని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహన్ని కదిలిస్తారు.
రేపు ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు వెల్డింగ్ పనులు పూర్తయ్యిన తర్వాత శోభాయత్ర ప్రారంభం అవుతుంది. టెలిఫోన్ భవన్, సచివాలయం మీదుగా రేపు ఉదయం 9:30 గంటలకు ఎన్టీఆర్ మార్గ్ కు ఖైరతాబాద్ గణేష్ చేరుకుంటుంది. రేపు ఉదయం 10:30 గంటలకు క్రేన్ నెంబర్ 4 దగ్గర పూజ కార్యక్రమాలు చేపట్టి, అనంతరం ఉదయం 11:30 ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరుగుతుంది.