వైఎస్సార్సీపీ(YSRCP) సీనియర్ నేత, మంగళగిరి ఎమ్మెల్యే(Mangalagiri MLA) ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) అలియాస్ ఆర్కే(RK) తన పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు.
మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆర్కే.. ప్రత్యర్థులపై కేసులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కొంత కాలంగా వైఎస్సార్సీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎమ్మెల్యేగా అధికారిక కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతూ పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంపై ఆయన అలకబూనినట్లు సమాచారం.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నా ఆయనతో కనీసం సంప్రదింపులు జరపలేదని ఆయన ఆవేదనలో ఉన్నట్లు సమాచారం. మంగళగిరి వైసీపీ ఇన్‌చార్జిగా గంజి చిరంజీవిని వైసీపీ అధిష్టానం నియమించింది. నిన్న ప్రత్యేకంగా ఆయన పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆర్కేకు ఆహ్వానం లేనట్లు తెలుస్తోంది.
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే.. పార్టీకి రాజీనామా చేయడం వెనుక అనేక కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? అనే చర్చ సాగుతోంది. మంగళగిరి అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ, బీసీలకు కేటాయిస్తుందనే ప్రచారం ఉన్న నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు స్పష్టమవుతోంది.