వర్సిటీ హాస్టల్ గదిలో ఓ విద్యార్థి ఏకంగా బాంబు తయారు చేయడం మొదలుపెట్టాడు. అయితే, బాంబు తయారు చేస్తున్న క్రమంలో అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటన అలహాబాద్ యూనివర్సిటీ(Allahabad University)లో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రభాత్ యాదవ్ (Prabhat Yadav) అనే విద్యార్థి అలహాబాద్ యూనివర్సిటీలో ఎంఏ(MA) చదువుతున్నాడు. వర్సిటీలోని పీసీ బెనర్జీ హాస్టల్(PC Banerjee Hostel)లో ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం తన గదిలో బాంబు(Bomb) తయారు చేస్తున్నాడు. ఈ క్రమంలో అది తన చేతిలోనే పేలిపోయింది.
ఈ ఘటనలో బాంబు తయారు చేస్తున్న ప్రభాత్ యాదవ్ చేతికి తీవ్రంగా గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గాయాలపాలైన విద్యార్థిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఏసీపీ రాజేశ్ కుమార్ యాదవ్ వెల్లడించారు.
అయితే, హాస్టల్ గదిలో ఇలాంటి చర్యలతో వర్సిటీ యాజమాన్యం షాక్‌కు గురైంది. అతడు బాంబు ఎందుకు తయారు చేస్తున్నాడన్న విషయంపై పోలీసులు హాస్టల్‌లోని విద్యార్థులను ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.