సినిమాల్లో బిజీగా ఉంటూనే తనకు ఇష్టమైన పొలిటికల్ లీడర్లకు మద్దతు ఇస్తుంటారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). గత ఎన్నికల సమయంలో ఏపీలో జనసేన (Janasena) కు మద్దతు తెలిపారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో కలిసి పాలకొల్లు మీటింగ్ లో కూడా పాల్గొన్నారు. అదే సమయంలో వైసీపీ (YCP) తరఫున నంద్యాలలో పోటీ చేసిన తన మిత్రుడు శిల్పా రవిరెడ్డిని గెలిపించాలని ప్రకటన విడుదల చేశారు. అయితే.. ఇప్పుడు తన మామ కోసం రంగంలోకి దిగుతున్నారు.
2011లో అల్లు అర్జున్, స్నేహారెడ్డిల పెళ్లి జరిగింది. స్నేహారెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (Chandrashekar Reddy) ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) పార్టీలో కొనసాగుతున్నారు. ఈయన వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. అంతేకాదు, తన తరఫున అల్లు అర్జున్ ప్రచారానికి కూడా వస్తారని చంద్రశేఖర్ రెడ్డి చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇస్తే నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానని.. తన కోసం అల్లు అర్జున్ ప్రచారం చేస్తారని వెల్లడించారు.
2014లో ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేశారు. కానీ, అప్పట్లో అర్జున్ ఈయన తరఫున ప్రచారం చేయలేదు. కానీ, ఈసారి మాత్రం అల్లుడి ఇమేజ్ ని వాడేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. కొన్నాళ్లుగా సాగర్ నియోజకవర్గంలో చంద్రశేఖర్ రెడ్డి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పనిలోపనిగా ఎవరికి ఇంటర్వ్యూలు ఇచ్చినా అల్లు అర్జున్ ని ఆకాశానికెత్తేస్తూ తెగ పొగిడేస్తుంటారు.
మామగా అల్లు అర్జున్ కు ఎన్ని మార్పులు ఇస్తారు అంటే.. వందకు వంద మార్కులు వేస్తానని పలు సందర్భాల్లో చెప్పారు చంద్రశేఖర్. అల్లు అర్జున్ సినిమాల పరంగా మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా ఎంతో మంచి మనసు ఉన్న వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించారు. మరోవైపు, తన మామకు సంబంధించిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంచర్ల కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించడానికి శనివారం నల్గొండలోని పెద్దవూర మండలం కొత్తగూడెం గ్రామానికి వెళ్లారు బన్నీ.