ఆధునిక యుగంలో మానవుడు ఎంత అభివృద్ధి సాధించిన, అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్న మూఢనమ్మకాలను మాత్రం విడిచి పెట్టడం లేదు.. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మంత్రాలు, దెయ్యాలు అంటూ మోసగాళ్లను ఆశ్రయించడం మనిషి మానుకోవడం లేదు. ఒకపక్క విశ్వరహస్యాలను ఛేదిస్తున్నాం.. మరోపక్క మూఢనమ్మకాలతో ప్రాణాలు కోల్పోతున్నాము. అయినా నమ్మకం, మూఢ నమ్మకం మధ్యన తేడా తెలుసుకోలేక పోతున్నారు మానవులు.. ఇక విషయానికి వస్తే..
అల్లూరి సీతారామరాజు (Alluri Sitharama Raju)జిల్లా, అరకు (Araku)లో ఉన్న దూదికొండి (Dudikondi) గ్రామాన్ని మూఢనమ్మకాలు ఆవహించాయి. 34 మంది జనాభా మాత్రమే ఉన్న ఈ గ్రామంలో రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు గిరిజనులు అనారోగ్యంతో మృతిచెందారు. ఇలా వరుసగా ముగ్గురు మరణించడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా ఈ మరణాలను అరికట్టేందుకు వైద్యులు ఇక్కడి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ వైద్యం చేయించుకోవడానికి ప్రజలు వెనకడుగు వేస్తున్నారు.
దీనికి కారణం ఆ ప్రాంతానికి చేతబడి చేశారని.. అందుకే మనుషులు చనిపోతున్నారనే భయం.. దీన్ని భయం అనడం కంటే మూఢ విశ్వాసం అంటే బాగుంటుంది. ఈ నమ్మకం వల్ల వైద్యం చేయించుకోవడానికి గిరిజనులు నిరాకరిస్తున్నారు. ఊహించని విధంగా ఇక్కడి మనుషులు ప్రవర్తిస్తుండటంతో వైద్యం చేసేందుకు డాక్టర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..